వెలుగు నీడలు...
bheemkonduru ·

"సూర్యుడి వైపు దృష్టి పెడితే, నీడలు మన వెనుకకు వెళ్ళిపోతాయి" అన్నారు హెలెన్ కెల్లర్.
మన చూపు ఎటువైపు ఉంటుందో, మన జీవన గమనం కూడా అటుగానే సాగుతుంది.
మనకు జరిగిన అన్యాయం మీదే ఎప్పుడూ దృష్టి పెడితే, క్రమంగా అదే మన పూర్తి కథగా మారుతుంది.
మన దగ్గర లేనివి, మనకు రాని అవకాశాలు, మనల్ని బాధపెట్టిన వాళ్లు, మనకు ఎదురైన ఇబ్బందులు - ఇవి నిజమే, కాదనడం లేదు.
కానీ వాటినే మళ్లీ మళ్లీ చూస్తూ, ఆలోచిస్తూ ఉంటే, మన కళ్ల ముందు ఉన్న మిగతా ప్రపంచం కనబడకుండా పోవచ్చు.
హెలెన్ కెల్లర్ జీవితం చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎదుర్కొన్న పరిమితులు మనలో చాలామందికి ఊహించడం కూడా కష్టం. చూపు లేదు. వినికిడి లేదు. చిన్న వయసు నుంచే ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఒక పెద్ద పోరాటం.
అయినా ఆమె తన జీవితాన్ని ఆ లోపాల చుట్టూ నిర్మించుకోలేదు.
"నాకు ఇవి లేవు" అన్నదానికంటే, "ఇంకా ఏమి ఉన్నాయి?" అన్న వైపు చూసింది.
మాటలు చెప్పడం ఇప్పుడు చాలా సులభం. ఆచరణ అంత సులభం కాదు.
ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, వాటి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది
మొదటిది మనకు జరిగినదాన్ని అర్థం చేసుకోవడం ఒకటి.
రెండవది మనల్ని మనం దానితోనే పూర్తిగా నిర్వచించుకోవడం మరోటి.
ఒక దశ తర్వాత మన కథలో "నాకు ఇది జరిగింది" అన్న వాక్యం, "అందుకే నేను ఇలా ఉన్నాను"గా మారిపోవచ్చు.
మనం చిన్న సమస్య వచ్చినా దానిని మనసులో పెద్ద తెర మీద వేసుకుని మళ్లీ మళ్లీ చూస్తాం. కానీ ఒక మంచి విషయం జరిగినప్పుడు? రెండు నిమిషాలు ఆనందించి, తర్వాత మరో సమస్య వెతుక్కుంటాం.
చీకటి మీద మనకు ఫోకస్ బాగా ఉంటుంది. వెలుగు విషయంలో మాత్రం concentration కొంచెం తక్కువ.
హెలెన్ కెల్లర్‌కి కష్టాలు లేవని కాదు. ఆమె వాటిని నిరాకరించలేదు కూడా. కానీ వాటిని తన జీవితానికి కేంద్రంగా చేసుకోలేదు.
జీవితంలో అనివార్యమైన వెలుగు నీడల్లో ఆమె వెలుగును ఎంచుకున్నారు.
మన జీవితంలో కూడా సమస్యలు పూర్తిగా పోవు. కొన్ని గాయాలు మానవు. కొన్ని అన్యాయాలు సరిచేసుకోలేము. కొన్ని లోటులు అలానే ఉండిపోతాయి.
కానీ మన దృష్టి ఎటువైపు ఉంది అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది.
ఎందుకంటే నీడలు ఎప్పుడూ ఉంటాయి.
అలానే వెలుగు కూడా.
ఎటువైపు నిలబడదాం??