కొన్ని విషయాలకు షార్ట్‌కట్‌లు ఉండవు
bheemkonduru ·

ఒకప్పుడు గంట పట్టే పని ఇప్పుడు కొన్ని నిమిషాల్లో అయిపోతోంది. మెయిల్ రాయాలా, presentation తయారు చేయాలా, ఏదైనా విషయం అర్థం చేసుకోవాలా - ఇది ఎంత సేపు "చిటికెలో" అయిపోతుంది అనిపిస్తుంది.
మనం వేగానికి చాలా త్వరగా అలవాటు పడతాం. ఒకసారి ఒక పని వేగంగా జరగడం చూశాక, ప్రతి పని అంతే వేగంగా జరగాలని ఆశించడం మొదలవుతుంది.
కెరీర్ త్వరగా ఎదగాలి.
వ్యాపారం త్వరగా నిలబడాలి.
ఆరోగ్యం త్వరగా మారాలి.
రిలేషన్‌షిప్ త్వరగా మనం కోరుకున్న స్థాయికి రావాలి.
ఏదైనా సమయం తీసుకుంటుంటే, వెంటనే ఒక అనుమానం, అసహనం.
దగ్గర దారుల కోసం "short cut" కోసం వెతుకుతాం.
కొన్ని విషయాలకు షార్ట్‌కట్‌లు ఉండవు. వాటి స్వభావమే అంత.
ఒక మంచి కెరీర్ ఒక్క ప్రమోషన్‌తో వచ్చెయ్యదు. సంవత్సరాల తరబడి పని చేస్తూ, తప్పులు చేస్తూ, సరిదిద్దుకుంటూ, మన సామర్థ్యం ఎంతో తెలుసుకుంటూ, మనల్ని మనం మలచుకుంటూ ముందుకు వెళ్ళాలి.
వ్యాపారం కూడా అంతే.
Idea ఒక మధ్యాహ్నం రావచ్చు. Website ఒక రోజులో తయారవచ్చు. AI వాడి ఐదు నిమిషాల్లో ఐదు లోగోలు తయారు చేయవచ్చు.
కానీ మనుషులు మనల్ని నమ్మడం?
దానికి ఇంకా పాత పద్ధతే.
ఒక customer వస్తాడు. తర్వాత ఇంకొకరు. మధ్యలో ఎవరూ రాని రోజులు ఉంటాయి. ఏది పనిచేస్తుందో తెలుస్తుంది. మొదట అద్భుతంగా అనిపించిన కొన్ని ideas నిశ్శబ్దంగా పక్కకు వెళ్లిపోతాయి.
బయట నుంచి చూస్తే పెద్దగా ఏమీ జరుగుతున్నట్టు కనిపించకపోవచ్చు.
కానీ లోపల అనుభవాలు నేర్పే పాఠాలు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటాయి.
రిలేషన్‌షిప్ విషయంలో మరీ తొందర అసలు కుదరదు.
ఒక పరిచయం మొదలవడానికి ఒక్క సంభాషణ సరిపోవచ్చు. ఒకరిని నిజంగా తెలుసుకోవడానికి మాత్రం చాలా సాధారణమైన రోజులు అవసరం.
సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో త్వరగానే తెలుస్తుంది. అలసిపోయినప్పుడు ఎలా ఉంటారు, కోపంలో ఎలా మాట్లాడతారు, మనకు అవసరమైనప్పుడు పక్కన ఉంటారా - ఇవన్నీ కాలంతోనే బయటపడతాయి.
నమ్మకం కూడా అలాగే. నమ్మకం ఒక రోజులో కుదిరినట్లు అనిపించవచ్చు.
అలా కుదరడానికి మాత్రం చిన్న చిన్న సందర్భాలు ఎన్నో కావాలి.
చెప్పిన మాట నిలబెట్టుకోవడం. అవసరమైనప్పుడు కనిపించడం. మన నుంచి ఏమీ అవసరం లేని సమయంలో కూడా అదే మనిషిగా ఉండడం.
ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మన అసహనం ఇంకా ఎక్కువ.
బరువు త్వరగా తగ్గాలి. స్టామినా త్వరగా పెరగాలి. కొత్త routine మొదలుపెట్టిన వారం నుంచే అద్దంలో కొత్త మనిషి కనిపించాలి.
కానీ శరీరానికి మన deadlines తెలియవు.
రోజూ నడవడం పెద్ద సంఘటనలా అనిపించదు. ఒక మంచి భోజనం జీవితాన్ని మార్చదు. ఒక రాత్రి బాగా నిద్రపోయినంత మాత్రాన నెలల అలసట పోదు.
అవే చిన్న పనులు మళ్లీ మళ్లీ జరుగుతుంటే, ఒక రోజు వెనక్కి చూసినప్పుడు తేడా కనిపిస్తుంది.
మార్పు జరిగిన తేదీ చెప్పలేం.
కానీ మార్పు జరిగిపోయి ఉంటుంది.
నిజానికి మనకు అసలు ఇబ్బంది సమయం పట్టడంలో కాదు.
మధ్యలో ఏమీ జరుగుతున్నట్టు కనిపించకపోవడంలో.
మనకు ఇతరుల జీవితాల్లో ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం. కొత్త ఇల్లు. ఎదిగిన business. ఫిట్‌గా మారిపోయిన శరీరం.
వాటికి ముందు గడిచిన సాధారణ రోజులు కనిపించవు.
ఎవరూ చూడని ప్రయత్నాలు కనిపించవు.
ప్రయత్నించి వదిలేసిన ideas కనిపించవు.
మళ్లీ మొదలుపెట్టిన సందర్భాలు కనిపించవు.
ఏ మార్పూ లేనట్టు అనిపించిన నెలలు కనిపించవు.
అందుకే వాళ్ళకు అన్నీ వేగంగా జరిగినట్టు, మనకే ఆలస్యమవుతున్నట్టు అనిపిస్తుంది.
AI మనకు చాలా పనులను వేగంగా చేయడం నేర్పుతోంది.
కానీ కొన్ని విషయాల దగ్గర మాత్రం technology ఎంత మారినా ఆట నియమాలు పాతవే ఉంటాయి.
నమ్మకం ఏర్పడటానికి సమయం పడుతుంది.
నైపుణ్యం రావడానికి సమయం పడుతుంది.
శరీరం మారడానికి సమయం పడుతుంది.
మనుషులు దగ్గరవడానికి సమయం పడుతుంది.
వేగంగా చేయగలిగిన పనిని నెమ్మదిగా చేయాల్సిన అవసరం లేదు.
కానీ నెమ్మదిగా జరగాల్సినదాన్ని వేగంగా చేయాలని తొందరపడితేనే సమస్య.
జీవితంలో కలకాలం మనతో నిలిచి ఉండే వాటికి సమయం పడుతుంది. అది ప్రకృతి నియమం.