Telugu Life

అత్యంత ఖరీదైన వ్యసనం...

bheemkonduru ·

వ్యసనం అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటి?
మందు, డ్రగ్స్‌, జూదం.
కానీ మన జీవితాలలో కంటికి కనిపించని వ్యసనం ఒకటి ఉంటుంది. అది మన నిర్ణయాల్ని చాలా ప్రభావితం చేస్తుంది.
ఇతరుల నుండి మెప్పు పొందడం. ఇంగ్లీషులో approval అనే మాట వాడుతుంటారు.

ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలి.
మన పని చూసి “బాగుంది” అనాలి.
మన గెలుపుని గుర్తించాలి.
మన జీవితం చూసి “వీడు బాగా స్థిరపడ్డాడు” అనాలి.
ఈ approval కోసం మనం ఎంత చేస్తున్నామో ఒక్కసారి గమనిస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది.

కొత్త కారు కొన్నాం.
కారు మనకు నచ్చిందా అన్నదానికంటే, దాన్ని చూసి పక్క వాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం.

ఎక్కడో వెకేషన్‌కు వెళ్ళారు
ఆ ప్రయాణం మనకు నచ్చిందా అనేదానికంటే, మనం “షేర్” చేసిన ఫోటోకి ఎన్ని లైకులు వస్తాయో అన్న ఆలోచనలు వస్తాయి.

ఎవరికో కాస్త సహాయం చేశాం.
సహాయం చేయడం కంటే, దాని గురించి చెప్పుకోవడం ముఖ్యమైపోతుంది. బహిరంగంగా కాకపోవచ్చు, కానీ అంతర్లీనంగా మన మాటల్లో ధ్వనిస్తూ ఉంటుంది.

ఎందుకంటే ఇలా మెప్పుపొందడం అనేదానికి అంతం అంటూ ఉండదు.
ఒక్కసారి సరిపోదు.
మళ్లీ మళ్ళీ కావాలి.
ఇంకొంతమంది నుంచి.
మరిన్ని లైకులు.
మరిన్ని ప్రశంశలు
మరింత గుర్తింపు
నిన్న వచ్చిన ప్రశంశలు ఇవాళ మనకు సాధారణంగా అనిపిస్తాయి. కాబట్టి ఇవాళ ఇంకేదో కావాలి.

ఇంతకన్నా వ్యసనం ఏముంటుంది.
మనకు కావాల్సింది వస్తుంది.
కొద్దిసేపు బాగుంటుంది.
తర్వాత మళ్లీ కావాలి.
ఇలా నెమ్మదిగా మన జీవితాన్ని నిరంతరం వేరొకరి కళ్ళతో చూస్తూ, వారికి ఆకట్టుపెట్టేస్తాం.

ఈ దేబిరింపు నుండి బయటపడటానికి మొదటి అడుగు కాస్త ప్రైవసీ ఉంచుకోవాలి.

కొత్త కారు కొన్నారా?
వెంటనే పోస్టు చేయకండి.
ఎవరికీ తెలియకుండా ఒక సహాయం చేశారా?
చెప్పకండి.
హాలిడేకి వెళ్లారా?
ప్రతి మంచి దృశ్యాన్ని చూసినప్పుడు, కెమెరా తీయాల్సిన అవసరం లేదు.

మొదట్లో ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది.
కానీ నెమ్మదిగా ఒక ఆసక్తికరమైన మార్పు మొదలవుతుంది.

మనం విలువైనవి అనుకున్నవి ఎవరూ చూడకపోయినా అంతే విలువైనదిగా కనిపిస్తుందా అనే విషయం గమనింపు లోనికి వస్తుంది.
ఎవరూ మెచ్చుకోకపోయినా మన achievement గురించి మనమే సంతోషించగలమా అని తెలుస్తుంది.
ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా మనం చేస్తున్న పని మనకు నచ్చుతుందా అని ఆలోచిస్తాం.

అక్కడే approval addiction కొంచెం బలహీనపడుతుంది.
మన దృష్టి బయట నుంచి లోపలికి వస్తుంది.

“వాళ్లు నా గురించి ఏమనుకుంటున్నారు?”
అన్నదాని నుంచి
“నేను ఏం కావాలనుకుంటున్నాను?”
అన్నదానికి.

అప్పుడు మనం చేసే కొన్ని పనులకు audience ఉండదు.
కానీ అవి నిజంగా మనవిగా ఉంటాయి.

చివరికి మన achievementని చూసి మనమే గర్వపడటం మొదలవుతుంది.
ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం ఉండదు.

approval addiction నుంచి బయటపడటం అంటే అందరి అభిప్రాయాల్ని పట్టించుకోకపోవడం కాదు.
మన గురించి మనకు ఉన్న అభిప్రాయం కంటే, అందరి అభిప్రాయాల్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండటం.
అది మొదలయ్యే చోటే కొంచెం స్వేచ్ఛ కూడా మొదలవుతుంది.