Telugu Life

తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై

bheemkonduru ·

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ఫూర్తిదాయక ప్రసంగం

విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏప్రిల్ 2026లో తన శతాబ్ది (100 సంవత్సరాల) ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, మరియు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ విశిష్ట అతిథులతో పాటు ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు "మాటల మాంత్రికుడు" త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తాను చదువుకున్న ప్రాంగణానికి తిరిగి వచ్చిన ఆయన, అందరినీ ఆలోచింపజేసేలా ఎంతో ఆత్మీయమైన మరియు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. విద్య యొక్క నిజమైన పరమార్థం ఏమిటి, తన ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో ఆ విశ్వవిద్యాలయం ఎలాంటి పాత్ర పోషించింది, అలాగే మొదట్లో తనను భయపెట్టిన ఆ విశాలమైన క్యాంపస్ తన జీవిత ప్రయాణానికి ఎలా బలమైన పునాదిగా మారిందనే విషయాలను ఆయన తన ప్రసంగంలో అద్భుతంగా పంచుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంగం

ఎక్సెలెన్సీ, హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రాధాకృష్ణన్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ వెంకయ్య నాయుడు గారికి, వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మిగతా పెద్దలు అందరికీ నా వందనాలు.

ముందు — ఇంతమంది ముందు మాట్లాడడం అంటేనే కొంచెం భయంగా ఉంది, మోకాళ్ళు వణుకుతున్నాయి. కానీ లక్కీగా podium పెట్టారు కాబట్టి మీకు ఎవరికీ కనపడదు. నాకు ఇక్కడ మాట్లాడే అర్హత ఎంత ఉందో నాకు తెలియదు — కేవలం ఇక్కడి ఒక పూర్వ విద్యార్థిని అనే అభిమానంతో పిలిచినట్టు ఉన్నారు.

విశ్వవిద్యాలయం మీద నాకు వచ్చిన అవగాహన చెప్తాను — ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకేం అవగాహన లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత అవగాహన వచ్చింది. ఈ సంవత్సరాల్లో నాకు నేను అర్థం చేసుకున్నది కొంత, ఇంకా ఏం నేర్చుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది కొంత — అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీకు కొద్దిగా అయినా ఉపయోగం కలిగినా, మీ introspection కి పనికొచ్చినా, మీ insight కి ఉపయోగపడినా — I will be very happy.

ముఖ్యంగా 'university' అనే మాటలోనే రెండు విషయాలు ఉన్నాయి — diversity ఒకటి, union ఒకటి. చాలా విభిన్నమైన ఆలోచనల్ని ఒకే చోటుకి కలిపి తీసుకొచ్చే స్థలాన్ని university అంటారని నా అర్థం. ఇక్కడ చెప్పడం కంటే మీరు నేర్చుకోవడం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు — విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని మీకు తీసుకొచ్చి నేర్పించడం కాదు. మీ ఎదురుకుండానే ఉన్నదాన్ని, మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడని దాన్ని — మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి చూపించడం. నాకైతే అలా అర్థమైంది.

Physics లో ఒక చాలా basic సూత్రం ఉంది — E=mc². దాంట్లో ఆయన ఏం చెప్తారంటే: ఒక energy ని మీరు సృష్టించలేరు, నాశనం చేయలేరు — ఒక form నుంచి ఇంకో form లోకి మార్చగలరు, అంతే. దీన్ని మీరు అన్నింటికీ apply చేయండి. మనం పుట్టకముందు నుంచి nature ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం కనిపెట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి, మన తర్వాత వేరేవాళ్ళు వాటిని చూస్తారు. మనం చూడడంలోనే తేడా ఉంది — అవి ఉండటంలో ఏ తేడా లేదు. ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవడానికి పనికొచ్చే వేదికగా university ని భావించాలని మీ అందరికీ చెప్తున్నాను.

ఇది ఒక విశాలమైన campus — మొట్టమొదట వచ్చిన ఎవరికైనా ముందు భయపెడుతుంది. 500 acres కంటే ఎక్కువ, నడిచినా తరగని రోడ్లు, పెద్ద పెద్ద ఎత్తైన ceilings, దూరంగా ఉండే class boards, వినపడినట్టు వినపడనట్టుగా ఉండే professors మాటలు — అన్నీ కూడా మొదట్లో negative గా అనిపిస్తాయి, ఇక్కడి నుంచి గమ్ముని వెళ్ళిపోదాం అనే feeling ఇస్తాయి. మందు చేదుగానే ఉంటుంది. Hospital వాసన మనకు సుగంధంలా అనిపించదు — కానీ అది మనకి ఉపయోగపడుతుంది, మనని బాగు చేస్తుంది, మనని మళ్ళీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఈ ప్రాంగణం కూడా అంతే — మొదట భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, అవగాహనలోకి తెచ్చుకోండి.

ఎందుకంటే మనమందరం వేరే వేరే cultures నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే — మన భాషే గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనే ఒక భావనలో ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా accept చేయడం నేర్పడానికే ఈ స్థలం ఉంది. అందుకే 130 కంటే ఎక్కువ దేశాల నుంచి ఇక్కడికి విద్యార్థులను పిలిపిస్తారు — అందరినీ కలపడం వల్ల మీకు చాలా విషయాల మీద మీకు ఉండే ఆలోచనల్లో మార్పు వస్తుంది కాబట్టి. కలవడం మూలంగానే గెలవడం జరుగుతుంది — ఏ మనిషికైనా సరే.

ముగించే ముందు ఒక్క మాట చెప్తాను — ఈ ఆంధ్ర యూనివర్సిటీ symbol లోనే ఉంటుంది: 'తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై' అని. ఈ తేజస్సుతో కూడిన విద్య మీ ధీశక్తిని మరింత పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవడం ద్వారా మనమందరం మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణించే ఆ అద్భుతమైన జీవితప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం తొలి మెట్టు కావాలని కోరుకుంటున్నాను.

నేను ఇక్కడికి వచ్చిన తర్వాత Physics చదవడం కంటే poetry ఎక్కువ రాశాను. ఇక్కడి library లో science పుస్తకాల కంటే తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం నాకు ఒక విషయం నేర్పింది — దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను.

మీ అందరికీ కూడా — మీకు నచ్చిన ఒక ఆయుధాన్ని తయారుచేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్న dignitaries అందరూ — ఒకళ్ళు వ్యాపార రంగంలో, మరొకళ్ళు రాజకీయ రంగంలో, ఇంకొకళ్ళు దేశ విదేశాల్లో రకరకాల రంగాల్లో — వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే, వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన మొదటి ప్రాంతం ఇదే.

అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటి అడుగు కావాలని, ఇక్కడి నుంచి తర్వాతి తరాలకు ఎంతోమంది మార్గదర్శకుల్ని తయారు చేసే ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.

శతాయుష్మాన్ భవ, ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం.