ఎవ్వరూ ఏమీ అనుకోరు...మీరూ అనుకోకండి
bheemkonduru ·

మనలో చాలా మందికి అంతర్లీనంగా ఒక భయం ఉంటుంది.
ఎక్కడికి వెళ్లినా ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్నారేమో అని అనుకుంటాం.
మనం మాట్లాడిన తీరు.
మనం వేసుకున్న బట్టలు.
ముఖం మీద వచ్చిన మొటిమ.
చెరిగిన జుట్టు
మీటింగ్‌లో చేసిన ఓ తప్పు
అందరి ముందు తడబడిన ఒక మాట.
ఇలా మనం మన గురించి తెగ వర్రీ అయిపోతూ ఉంటాం.
ఎవరైనా మనల్ని చూసి నవ్వితే, ఆ నవ్వు మన గురించే అయి ఉండొచ్చని అనిపిస్తుంది.
ఇంకా దారుణం ఏమిటంటే — మనం చేసిన ఒక చిన్న తప్పును గంటల తరబడి గుర్తుచేసుకుంటూ ఉంటాం.
“నేను అలా ఎందుకు అన్నాను?”
“వాళ్లు ఏమనుకున్నారో?”
“అందరూ గమనించే ఉంటారు.”
“రేపు ఆఫీస్‌కి వెళ్తే ఎలా?”
మన తలలో మాత్రం ఆ సంఘటనకు ఒక పూర్తి సినిమా తయారైపోతుంది.
కానీ మనకు తెలియని ఓ చిన్న విషయం ఏమిటంటే
మన సినిమాకి అంతమంది ప్రేక్షకులు ఉండరు.
ఎందుకంటే వాళ్లందరూ కూడా తమ తమ సినిమాలు చూస్తుంటారు.
అందరి జ్ఞాపకాల్లో, జీవితాలలో మన పాత్ర చాలా చిన్నది
ఇది మొదట వింటే కొంచెం బాధగా అనిపించవచ్చు.
కానీ నిజానికి ఇందులో చాలా స్వేచ్ఛ ఉంది.
మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాని మధ్యలో ఉన్నాం.
కానీ ఇతరుల జీవితంలో మనం సాధారణమైన ఒక చిన్న పాత్ర మాత్రమే.
మీరు ఒక స్నేహితుడితో మాట్లాడినప్పుడు మీరు ఇంటికి వెళ్లి ఆ సంభాషణలోని ప్రతి మాటను గుర్తుచేసుకుంటూ ఉండొచ్చు.
అతను కూడా ఇంటికి వెళ్లి మీ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడని అనుకోవాల్సిన అవసరం లేదు.
అతనికి తన పని ఉంది.
తన కుటుంబం ఉంది.
తన డబ్బు సమస్యలు ఉన్నాయి.
తన సంబంధాల గురించి ఆలోచనలు ఉన్నాయి.
తన ఆరోగ్యం, భవిష్యత్తు, పిల్లల చదువు, బాస్‌తో జరిగిన గొడవ... ఏదో ఒకటి ఉంటుంది.
మనల్ని గమనించడానికి వాళ్ల దగ్గర మనం అనుకున్నంత ఖాళీ ఉండకపోవచ్చు.
విచిత్రంగా అనిపించినా, మన జీవితాలలో మనమే కథానాయకులం లేదా నాయికలం
కానీ వేరొకరి జీవితంలో మనం కేవలం కారెక్టర్ ఆర్టిస్టులమే
వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ ఏమనుకుంటారో
“నేను ఇలా కనిపిస్తే?”
“వాళ్లు నన్ను తక్కువగా అనుకుంటే?”
“నా గురించి చెడ్డ అభిప్రాయం ఏర్పడితే?”
అనే భయం చాలా నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
కొత్త వాళ్లతో మాట్లాడకుండా ఆపుతుంది.
మనకు నచ్చిన పని మొదలుపెట్టకుండా ఆపుతుంది.
స్టేజీ మీద మాట్లాడకుండా చేస్తుంది.
మన అభిప్రాయం చెప్పకుండా చేస్తుంది.
కొత్త బట్ట వేసుకుని బయటకు వెళ్లడానికి కూడా కొన్నిసార్లు రెండుసార్లు ఆలోచింపజేస్తుంది.
ఎందుకంటే మనం మన మీద పడే తీర్పును ముందుగానే ఊహించుకుంటాం.
వాళ్లు ఏమనుకుంటారో మనకు తెలియదు.
కానీ మన మెదడు ఖాళీని ఒక కథతో నింపేస్తుంది.
ఆ కథలో సాధారణంగా మన మీదే తీర్పు ఉంటుంది.
“బాగాలేడు.”
“వింతగా ఉన్నాడు.”
“చాలా మాట్లాడుతున్నాడు.”
“అతనికి ఏమీ తెలియదు.”
“ఆమె చాలా ఓవర్‌గా చేస్తోంది.”
ఇలా.
కానీ నిజంగా వాళ్లు అలా అనుకుంటున్నారో లేదో మనకు తెలియదు.
చాలాసార్లు వాళ్లు అసలు మన గురించి ఆలోచించకపోవచ్చు.
సోషల్ మీడియా అద్దంలో...
ఇది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
మనం ఒక ఫొటో పోస్ట్ చేస్తాం.
ఎన్ని లైక్స్ వచ్చాయి?
ఎవరు లైక్ చేయలేదు?
ఎవరు చూశారు?
ఎవరు స్పందించలేదు?
ఎవరు స్పందించి కూడా ఏమీ రాయకుండా వెళ్లిపోయారు?
ఒకప్పుడు మనం మన ముఖాన్ని అద్దంలో చూసుకునేవాళ్లం.
ఇప్పుడు మనల్ని మనం ఇతరుల ప్రతిస్పందనల్లో చూసుకుంటున్నాం.
ఒక పోస్ట్‌కి తక్కువ స్పందన వస్తే, “బహుశా ఎవరికీ నచ్చలేదేమో” అనుకుంటాం.
ఒకరు కామెంట్ చేయకపోతే, “నాపై కోపంగా ఉన్నారా?” అనుకుంటాం.
ఒక ఫొటోలో మనం బాగా కనిపించకపోతే, దాన్ని అందరూ గమనించారని అనుకుంటాం.
కానీ అదే సమయంలో మన ఫోన్‌లో కనిపించే వందల పోస్టుల్లో మనం ఎన్ని ఫొటోలు, ఎన్ని చిన్న తప్పులు, ఎన్ని ముఖ కవళికలు నిజంగా గుర్తుపెట్టుకుంటాం?
చాలా తక్కువ.
మనకు ఇతరుల జీవితాలు స్క్రోల్‌లో కనిపిస్తాయి.
మన జీవితం మాత్రం మనకు క్లోజప్‌లో కనిపిస్తుంది.
అంతే తేడా.
ఇది నిర్లక్ష్యం కాదు. విముక్తి
“ఎవరూ నిన్ను పట్టించుకోరు” అనే అర్థంలో ఇది చెప్పడం కాదు.
మనల్ని ప్రేమించే వాళ్లు ఉంటారు.
మన గురించి నిజంగా ఆలోచించే వాళ్లు ఉంటారు.
మన తప్పులను గమనించే వాళ్లు కూడా ఉంటారు.
కానీ మనం ఊహించుకునే స్థాయిలో ప్రతి ఒక్కరూ రోజంతా మన గురించి ఆలోచించరు.
అది మనకు అర్థమైనప్పుడు ఒక విచిత్రమైన భారం దిగిపోతుంది.
మనం ప్రతి మాటను కొలిచి మాట్లాడాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రతి చిన్న తప్పును జీవితాంతం మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నా ప్రపంచం అంతమైపోదు.
ఎవరైనా మనల్ని ఇష్టపడకపోయినా మన జీవితం ఆగిపోదు.
ఎక్కడైనా పొరపాటు జరిగితే, “అవును, జరిగింది” అని అంగీకరించి ముందుకు వెళ్లొచ్చు.
ఎందుకంటే మనం అనుకున్నంతమంది ప్రేక్షకులు బయట కూర్చుని మన ప్రదర్శనను తిలకించడం లేదు.
మనమే కొన్నిసార్లు మన జీవితానికి ప్రేక్షకులనూ, జడ్జీలనూ, వ్యాఖ్యాతలనూ, శిక్షాధికారులనూ ఒకేసారి నియమించేసుకుంటాం.
అదీ ఉచితంగా.
మనకు మనమే..
మన గురించి ఇతరులు ఏం అనుకుంటారో పూర్తిగా పట్టించుకోకపోవడం సాధ్యం కాదు.
అది అవసరం కూడా లేదు.
మనుషులం కదా.
కానీ ప్రతి చూపును తీర్పుగా, ప్రతి నవ్వును అవమానంగా, ప్రతి మౌనాన్ని తిరస్కరణగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
మన గురించి మనం అనుకున్నంతగా ప్రపంచం ఆలోచించడం లేదు.
ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది.
కానీ ఒకసారి ఆ నిజం మనసులో నాటుకుంటే, అది ఓటమిలా అనిపించదు. స్వేచ్ఛలా అనిపిస్తుంది.
ఎందుకంటే మనం ఇంతకాలం ఎవరి కోసం నటించామో, ఎవరి తీర్పు కోసం భయపడ్డామో చూస్తే...
చాలాసార్లు మనకు ప్రేక్షకులు, న్యాయనిర్లేతలు వాళ్లు కాదు.
మనమే