Telugu Life

స్వాభిమానం అంటే ...

bheemkonduru ·

ఎవరికో ఓ మెసేజ్‌ చేస్తాం.
సమాధానం రాదు.
మళ్లీ మెసేజ్ చేస్తాం.
“ఏమైంది?” అని అడుగుతాం.
రిప్లై రాకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తాం
వాళ్లు బిజీగా ఉన్నారేమో అనుకుంటాం.
తర్వాత మనమే ఏదైనా తప్పు చేశామా అని ఆలోచిస్తాం.
ఇలా కొంత సమయం గడిచాక… వాళ్ల ప్రవర్తనకు కూడా మనమే explanation తయారు చేసుకుంటాం.
ఇది మనిషి స్వాభిమానం కోల్పోయే ముందు అనివార్యంగా జరిగే ప్రక్రియ.

మనిషికి తన మీద గౌరవం తగ్గిపోవడం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది.
ఎవరూ వచ్చి “నువ్వు అంత ఇంపార్టెంట్‌ కాదు” అని చెప్పరు.
మనమే చిన్న చిన్న విషయాల్లో అలా అనుకుని అలవాటుపడిపోతాం.

నన్ను పిలవలేదు — అయినా ఎందుకు పిలవలేదో తెలుసుకోవాలి.
చివరి నిమిషంలో పిలిచారు — ఏదైనా సరే వెళ్లాలి.
ఎప్పుడూ నేనే ఫోన్ చేస్తున్నాను — అయినా ఇంకోసారి చేద్దాం.
నన్ను ఉపయోగించుకుంటున్నట్టు అనిపిస్తోంది — కానీ “లేదు” అంటే వాళ్లు ఏమనుకుంటారో?
నా మాటలు అర్థం చేసుకోలేదు — ఇంకొంచెం explain చేస్తే అర్థం చేసుకుంటారేమో.
ప్రతిసారీ మనల్ని మనమే కొంచెం తగ్గించుకోవడం వల్ల మన ఆత్మగౌరవం పోతుంది.

ఆత్మగౌరవం అంటే “నేనే గొప్ప” అనుకోవడం కాదు.
అది అసలు confidence కూడా కాదు.
ఎవరైనా మనల్ని ఇష్టపడాలని, మనల్ని గౌరవించాలని,
మనతో ఉండాలని మనం ఎదుటివారిని బలవంతం చేయలేమని అర్థం చేసుకోవడం.
అంతే.

ఎవరైనా మనతో మాట్లాడాలని అనుకోకపోతే వాళ్ల వెంటపడాల్సిన అవసరం లేదు.
ఎక్కడ మన ఉనికి అవసరం లేదో అక్కడ మన presenceని prove చేసుకోవాల్సిన అవసరం లేదు.
మనల్ని పదే పదే ignore చేస్తున్న వాళ్ల attention కోసం మన dignityని ఖర్చు చేయాల్సిన పనిలేదు.

మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే…
మనం ప్రక్కనవాళ్ళకు ఈ విషయాలన్నీ చాలా సులభంగా చెబుతాం.
“వాడిని ఎందుకు అంతగా పట్టించుకుంటున్నావు?”
“వాళ్లకు నువ్వు అవసరం లేకపోతే వదిలేయ్.”
“నీ value నీకు తెలుసా?”
అదే పరిస్థితి మనకు వస్తే మాత్రం మనసు మరో lawyerని పెట్టుకుంటుంది.
“కానీ వాళ్లు అలా ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు…”
అవును. ఉండకపోవచ్చు.
కానీ ప్రతి విషయానికీ explanation వెతుక్కుంటూ ఉండాల్సిన బాధ్యత కూడా మనది కాదు.

కొన్ని విషయాలకు closure అవసరం లేదు.
కొన్ని సంబంధాలకు చివరి conversation అవసరం లేదు.
కొన్ని invitationsని simply decline చేయొచ్చు.
కొన్ని plans నుంచి quietly move on అవ్వొచ్చు.
కొన్ని చోట్ల మనమే ఎప్పుడూ conversation మొదలు పెడుతున్నామంటే… ఒకసారి వెనక్కి తగ్గి చూడొచ్చు.
ఎవరు మన దగ్గరకు వస్తారో చూడటానికి కాదు.
మనమే ఎప్పుడూ అందరి దగ్గరకు ఎందుకు వెళ్తున్నామో చూడటానికి.

స్వాభిమానం అంటే తలుపులు అన్నీ మూసేసుకుని ఒంటరిగా కూర్చోవడం కాదు.
అవసరమైన చోట దగ్గరగా ఉండటం.
అవసరం లేని చోట కొంచెం దూరంగా నిలబడటం.
“లేదు” అని చెప్పాల్సినప్పుడు చెప్పడం.
ప్రతి విషయానికీ justification ఇవ్వకపోవడం.
మనల్ని మనం పదే పదే prove చేసుకోవాల్సిన సంబంధాలను గుర్తించడం.

ముఖ్యంగా…
ఎవరైనా మన విలువను గుర్తించకపోయిన ప్రతిసారీ, మన విలువను మనమే ప్రశ్నించుకోవడం.

అందరూ మనల్ని ఇష్టపడరు.
అందరూ మనల్ని అర్థం చేసుకోరు.
అందరూ మనకు తిరిగి అదే ప్రేమ, సమయం, గౌరవం ఇవ్వరు.
అది కొంచెం బాధగా ఉంటుంది.
కానీ దాని కోసం మనల్ని మనమే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు.
జీవనప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది.
మనల్ని గుర్తించమని, గౌరవించమని ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు.

కొన్ని తలుపులు మన కోసం తెరుచుకోకపోతే…
అక్కడే నిలబడి తలుపు కొడుతూనే ఉండాల్సిన అవసరం కూడా లేదు.