ప్రతి మౌనాన్ని మనం పూరించాల్సిన అవసరం లేదు
bheemkonduru ·

మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నది ఎదుటి వాళ్లకి అర్ధం అవ్వాలని కోరుకుంటాం.
ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ మనం అక్కడితో ఆగము.
వాళ్ళు మనం చెప్పింది అంగీకరించాలి
మనం కోరుకున్న స్పందన వాళ్ళలో కనిపించాలి.
అది జరగకపోతే మనలో ఏదో అసహనం మొదలవుతుంది.
“బహుశా నేను సరిగ్గా చెప్పలేదేమో.” అనుకుంటాం.
ఇంకొంచెం వివరిస్తాం.
మరో కోణంలో చెబుతాం.
మన మాటలకు ప్రాతిపదిక ఏంటో చెబుతాం
ఎందుకు అలా అన్నామో చెబుతాం.
అవసరం లేకపోయినా మనం చెప్పిన విషయాన్ని రకరకాలుగా మళ్లీ మళ్లీ చెప్తాం.
చివరికి మనం చెప్పాలనుకున్న విషయం కంటే, మనల్ని మనం explain చేసుకోవడమే ఎక్కువైపోతుంది.
ఇది చాలాసార్లు మంచి communication అనిపిస్తుంది.
కానీ కాస్త లోతుగా చూస్తే, అది మన insecurity.
మన మాట మీద మనకు పూర్తి నమ్మకం లేనప్పుడు, మన మాటలలో వివరణలు ఎక్కువ అవుతాయి.
మన అభిప్రాయం విలువైనదేనా?
నేను ఇలా చెప్పడానికి అర్హుడినేనా?
వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారా?
వాళ్లకు నచ్చకపోతే?
ఇలాంటి ఆలోచనలు మన మనసులో దొర్లుతూ ఉంటాయి.
మన మీద మనకు నమ్మకం తగ్గే కొద్దీ, మన మాటలు ఎక్కువ అవుతాయి.
ఒక వాక్యం సరిపోయే చోట ఒక పేరాకి సరిపడా మాట్లాడతాం..
ఒక పేరా సరిపోయే చోట ఒక సమర్థనలతో ఒక పేజీ వస్తుంది.
మనం మాట్లాడే మాటల మీద మనకి clarity ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ
మన మీద మనకున్న అపనమ్మకానికి మనమే రాసుకుంటున్న పొడవైన explanation.
ఇందులో మరో విషయం గుర్తుంచుకోవాలి.
మనం చెప్పిన మాటను అవతలి వ్యక్తి తీసుకోకపోవచ్చు.
ఆసక్తి చూపకపోవచ్చు.
స్పందించకపోవచ్చు.
అది కూడా ఒక సమాధానమే. ఇది గుర్తించాలి.
ప్రతి నిశ్శబ్దానికి వంద అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు.
ఎవరైనా మనం చెప్పేది వినాలనుకోకపోతే, మనం ఇంకా వివరంగా చెప్పడం ద్వారా వాళ్ళకి ఆసక్తిని కలిగించలేం.
మన దగ్గర ఇంకో వివరణ ఉండొచ్చు.
ఇంకా మంచి పదాలు ఉండొచ్చు.
ఇంకా Convince చేసే arguments ఉండొచ్చు.
కానీ ఆసక్తి లేని చోట మనం ఇవ్వాలనుకున్న క్లారిటీ కూడా noise లాగా అయిపోతుంది.
అక్కడ ఆగడం నేర్చుకోవాలి.
దీనిని మనం “నామోషీ”గా భావించాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఇలా ఆగుతున్నాం అంటే, ఎదుటి వ్యక్తిని పట్టించుకోకపోవడం కాదు
వాళ్ల ఛాయిస్‌ను గౌరవించడం.
అదే సమయంలో మనల్ని మనం కూడా గౌరవించుకోవడం.
మనలో చాలా మందిలో ఒక రకమైన ధోరణి ఉంటుంది.
ఎవరైనా మన మాటకు (మనం అనుకున్నట్లు)స్పందించకపోతే, వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అనిపిస్తుంది.
వాళ్లు వెనక్కి అడుగు వేస్తే మనం ముందుకు అడుగు వేస్తాం.
వాళ్లు మౌనంగా ఉంటే మనం మరింత వివరంగా మాట్లాడతాం.
వాళ్లకు ఆసక్తి లేదనే సంకేతాన్ని కూడా, “నేను ఇంకా బాగా explain చేయాలి” అని అర్థం చేసుకుంటాం.
ఎందుకంటే మనకు వాళ్ళ అంగీకారం కావాలి.
కానీ...
ప్రతి మనిషికి మన మాట వినాల్సిన బాధ్యత ఉండదు.
ప్రతి ఒక్కరికీ మన ఆలోచనల మీద ఆసక్తి ఉండదు.
ప్రతి సంబంధం మనం కొనసాగించాలనుకున్నంతగా వారు అనుకోకపోవచ్చు
ఇది కొంచెం బాధ కలిగించే నిజమే.
కానీ దీన్ని అంగీకరించిన తర్వాత, మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
ఆత్మవిశ్వాసం అంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కాదు.
కొన్నిసార్లు మనం చెప్పాల్సింది స్పష్టంగా చెప్పి, అక్కడితో ఆపేయగలగడం.
“నేను చెప్పాను. ఇక వాళ్ల ఇష్టం.”
అనే స్థితి.
మన మాటను defend చేయకుండా ఉండగలగడం.
మన విలువను నిరూపించడానికి conversationను పొడిగించకుండా ఉండగలగడం.
ముఖ్యంగా, ఎదుటివారికి ఆసక్తి చూపడం లేదని తెలిసిన తర్వాత మన వాదాన్ని వాళ్ళ మీద రుద్దడం కాదు.
ఇలా చేయడం కేవలం communication skill కాదు.
అందులో కొంత పరిణితి ఉంది.
కొంత self-respect ఉంది.
ముఖ్యంగా, “నేను చెప్పేది వినిపించాలంటే నేను ఇంతగా నన్ను నేను అమ్ముకోవాల్సిన అవసరం లేదు” అనే నమ్మకం ఉంది.
చెప్పాల్సింది చెప్పడం మన బాధ్యత.
అది అర్థం చేసుకోవాలా వద్దా అనేది అవతలి వ్యక్తి స్వేచ్ఛ.
వాళ్లు స్పందించాలా వద్దా అనేది వారి ఇచ్ఛ.
ఆ రెండు మధ్యలో మనం చేయగలిగిన గొప్ప పని ఒక్కటే.
ఆగడం.
ఎందుకంటే ప్రతి మౌనం మనం పూరించాల్సిన ఖాళీ కాదు.
కొన్ని మౌనాలు ఒక నిర్ణయం.
కొన్ని మౌనాలు ఒక సమాధానం.
వాటిని గౌరవించగలిగినప్పుడు, మన మాటల్ని మనం కూడా గౌరవించడం మొదలుపెడతాం.