రెండు నిమిషాల సూత్రాలు!
bheemkonduru ·

మొదటిది - అప్పటికప్పుడు చేసెయ్యడం (డేవిడ్ అలెన్ - Getting Things Done)
ప్రపంచ ప్రసిద్ధ రచయిత డేవిడ్ అలెన్ తన Getting Things Done అనే పుస్తకంలో ఈ సూత్రాన్ని చెప్పారు. ఈ సూత్రం చాలా సూటిగా, సులభంగా ఉంటుంది. ఒక పనిని పూర్తి చేయడానికి రెండు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయం అవసరమైనట్లయితే, ఆ పనిని ఇంకెవరికీ అప్పగించకుండా, వెంటనే పూర్తి చేయాలంటారాయన.
సాధారణంగా, మనం చిన్న పనుల గురించి కూడా అనవసరంగా ఆలోచిస్తాము. ఉదాహరణకు, 'చెత్తబుట్టను బయట పెట్టాలి' అనే చిన్న పనికి రెండు నిమిషాలే పడుతుంది. కానీ దాని గురించి మనసులో పదేపదే ఆలోచించడం, దాన్ని 'టు-డూ లిస్ట్'లో చేర్చడం, మళ్లీ వచ్చి చేయడం వంటి వాటి వల్ల ఎక్కువ సమయం వృథా అవుతుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ పనిని ముగించడం వలన, ఆ పని గురించి మళ్లీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా మన మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధంగా, మన శక్తి పెద్ద పనులపై దృష్టి సారించడానికి ఉపయోగించబడుతుంది.
రోజువారీ జీవితంలో మనం తరచుగా వాయిదా వేసే కొన్ని పనులు:
- మీ డెస్క్ లేదా స్టడీ టేబుల్ సర్దుకోవడం.
- మీరు చదివిన పుస్తకాన్ని లేదా మ్యాగజైన్‌ను సరైన స్థానంలో ఉంచడం.
- కుటుంబసభ్యులకు చిన్నపాటి వాట్సాప్ సందేశం పంపడం.
- మీ మొక్కలకు నీరు పోయడం లేదా ఎండిన ఆకులు తొలగించడం.
- వచ్చిన ఒక ముఖ్యమైన మెయిల్ లేదా మెసేజ్‌కు 'ఓకే' అని బదులు ఇవ్వడం.
ఈ విధంగా చిన్న పనులను పేరబెట్టకుండా, వెంటనే పూర్తి చేయడం మన మెదడుకు 'విజయవంతంగా పూర్తి చేశాం' అనే అనుభూతిని ఇస్తుంది, తద్వారా పని చెయ్యడానికి మెదడుకు ప్రేరణ లభిస్తుంది, తద్వారా బద్ధకం క్రమంగా దూరమవుతుంది.
రెండవది: అలవాట్లను సులభతరం చేయడం (జేమ్స్ క్లియర్ - Atomic Habits)
మొదటి సూత్రం పనులను త్వరగా పూర్తి చేయడానికి ఉపకరిస్తే, రెండవ సూత్రం 'అలవాట్లు' (Habits) ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సూత్రం జేమ్స్ క్లియర్ రచించిన పాపులర్ పుస్తకం Atomic Habits లో చెప్పబడివుంది.
కొత్త అలవాటును ఏర్పరచుకోవడానికి కష్టంగా లేదా భయంగా అనిపించే ఒక పనిని ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ పనిని రెండు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ వ్యవధికి సరళతరం చేయాలని ఆయన సూచిస్తారు
- "ప్రతిరోజూ వ్యాయామం చేయాలి" అనేది కష్టంగా అనిపించినట్లయితే, దాన్ని కేవలం స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం వరకు పరిమితం చెయ్యాలి.
- "రోజుకు ఒక గంట చదవాలి" అనే పెద్ద లక్ష్యం బదులు, అది కేవలం పుస్తకంలో ఒక పేరా చదవడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
- "ప్రతిరోజూ ధ్యానం చేయాలి" అనే లక్ష్యం బదులు, దాన్ని కేవలం ఒక నిమిషం పాటు ప్రశాంతంగా కూర్చోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
కొంతమందికి, ఇదంతా ఒక ట్రిక్కులా అనిపించవచ్చు అనిపించవచ్చు. కానీ అలవాటును ఏర్పరచుకోవడానికి ఇది చాలా శక్తివంతమైన పద్దతి.
ఇందులో రహస్యం ఏమిటంటే... ఒక అలవాటును పెంపొందించుకోవడంలో అత్యంత కష్టమైన భాగం 'ప్రారంభించడం' (Starting). ఈ 2 నిమిషాల సూత్రం 'ప్రారంభించే' ప్రక్రియను చాలా సులభం చేస్తుంది. మొదట అలవాటును స్థిరపడ్డాక, దాన్ని క్రమంగా విస్తరించడం చాలా సులువు అవుతుంది. రోజూ ఒక పేరా చదవడం మొదలుపెడితే, కొన్ని రోజుల్లో అది ఆటోమేటిక్‌గా ఒక పేజీ, ఆ తర్వాత ఒక అధ్యాయంగా మారుతుంది.
ఈ రెండు 'రెండు నిమిషాల నియమాలను' మీ దైనందిన జీవితంలో అమలు చేయడం ద్వారా, బద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా, 'రేపు' కోసం వాయిదా వేయబడే పనులన్నీ క్రమంగా పూర్తవుతాయి. చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు సాధించబడతాయనడంలో సందేహం లేదు!