ఐదు సంవత్సరాల ఆరు వారాలు...ద్రవిడ్ జీవిత పాఠాలు.
bheemkonduru ·

జీవితంలో సక్సెస్ అవ్వడం ఎలా? అసలు మనకంటూ ఒక గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి? "ది వాల్" రాహుల్ ద్రవిడ్ తన ఎదుగుదల, ఓర్పు, జీవన ప్రయాణం గురించి పంచుకున్న విలువైన ఆలోచనలు ఆయన మాటల్లోనే...
విజయం సాధించడం ఎలా? నిజం చెప్పాలంటే, విజయం సాధించడానికి లక్ష మార్గాలు ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరం మన సొంత మార్గాన్ని మనమే వెతుక్కోవాలి.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ చిన్న పిల్లాడిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ పిల్లాడిని నేనే. నా చిన్ననాటి రోజుల్లో, నేను దేనికోసం పుట్టానో నా మనసు లోతుల్లో నాకు ముందే తెలుసనిపించేది. ద్రవిడ్ కుటుంబంలో పుట్టడం కేవలం యాదృచ్ఛికం కాదనిపించేది. కొన్నిసార్లు inspiration మనల్ని కళ్ళప్పగించి చూస్తుందని నేను తెలుసుకున్నాను. నా పాఠశాల రోజుల్లో, నేను నా క్రికెట్ ప్రపంచంలో మరింతగా మునిగిపోతూ వచ్చాను. అప్పట్లో ఇంటర్-స్కూల్ టోర్నమెంట్ గెలవడం అంటే ప్రపంచ కప్ గెలిచినట్లు అనిపించేది. స్కూలు, రాష్ట్ర జట్లకు కెప్టెన్‌గా ఉండటమే నా జీవిత పరమావధిగా ఉండేది. కొన్నిసార్లు ఊహించని వ్యక్తుల నుండి, ఊహించని ప్రదేశాల నుండి తోడ్పాటు లభిస్తుందని అది మన జీవితంలో ఎంతో పెద్ద మార్పును తెస్తుందని నేను గ్రహించాను.
దేశవాళీ (డొమెస్టిక్) క్రికెట్‌లో దాదాపు ఐదేళ్ల పాటు ఆడిన తర్వాతే నాకు జాతీయ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆ రోజులు చాలా నిరాశ, అసహనంతో నిండి ఉండేవి. నా కైనెటిక్ హోండా స్కూటర్‌పై "God's delays are not God's denials" (దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన తిరస్కరించినట్లు కాదు) అనే స్టిక్కర్ అతికించుకున్నది నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రతిరోజూ ఉదయం స్కూటర్ ఇంజిన్ స్టార్ట్ చేసి, నా కిట్ బ్యాగ్‌ను వెనుక పెట్టుకుని బయలుదేరేటప్పుడు... నాపై నాకు నమ్మకం సడలకుండా ఉండటానికి అదొక సున్నితమైన గుర్తుగా ఉండేది.
మీరు చైనీస్ వెదురు విత్తనాన్ని తీసుకుని పెరట్లో నాటారనుకోండి. దానికి రోజూ నీళ్లు పోసి, ఒక సంవత్సరం పాటు ఎంతో శ్రద్ధగా చూసుకున్నా కనీసం ఒక్క చిన్న మొలక కూడా కనిపించదు. వాస్తవానికి, ఐదేళ్ల వరకు అసలు మొలకే రాదు. కానీ అకస్మాత్తుగా, ఐదేళ్ల తర్వాత నేల నుండి ఒక చిన్న మొలక బయటకు వస్తుంది. ఆ తర్వాత కేవలం ఆరు వారాల్లోనే ఆ మొక్క దాదాపు 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది! ప్రతి 24 గంటలకు దాదాపు 39 అంగుళాల వేగంతో పెరుగుతుంది. ఆ ఎదుగుదలను మీరు కళ్లారా చూడొచ్చు.
అసలు ఏమీ కనిపించని ఆ ఐదేళ్ల కాలంలో ఆ మొక్క ఏం చేసింది? ఐదు పూర్తి సంవత్సరాల పాటు అది తన వేర్లను నేల లోతుల్లోకి బలంగా విస్తరించుకుంది. భవిష్యత్తులో వేగంగా, భారీగా ఎదగడానికి తనను తాను సిద్ధం చేసుకుంది. ఆ బలమైన వేర్ల వ్యవస్థ లేకపోతే, అంత పెద్ద ఎదుగుదలను ఆ మొక్క తట్టుకుని నిలబడలేదు. ఆ మొక్క ఆరు వారాల్లోనే 90 అడుగులు పెరిగిందని కొందరు అనవచ్చు. కానీ నా దృష్టిలో అది ఐదేళ్ల ఆరు వారాల్లో 90 అడుగులు ఎదిగింది.
నా ప్రయాణం మొదలైనప్పుడు, మా నాన్నకున్న అభిరుచి నుండే నేను స్ఫూర్తి పొందాను, దాన్నే నా లక్ష్యంగా మార్చుకున్నాను. నేను ఎంచుకున్న శిఖరాన్ని అధిరోహించడం మొదలుపెట్టినప్పుడు... నా పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఎంతో మంది వ్యక్తుల నుంచి నాకు అడుగడుగునా గొప్ప మద్దతు లభించింది. స్పష్టమైన విజయం నాకు వెంటనే దక్కకపోవచ్చు. కానీ నా ప్రారంభ అనుభవాలు నాకో బలమైన పునాదిని ఏర్పరచాయి. అది భవిష్యత్తులో నన్ను సమర్థుడిగా, దృఢంగా తీర్చిదిద్దింది.
ఒంటరిగా కూర్చుని నా విజయాలను, అపజయాలను చూసుకున్నప్పుడు నన్ను నేను మరింతగా అర్థం చేసుకోగలిగాను. నేను ఎంచుకున్న శిఖరాన్ని చేరుకోవడమే నాకు సర్వస్వమైంది, అందులోనే లీనమైపోయాను. నా లక్ష్యమనే శిఖరానికి దగ్గరవుతున్న కొద్దీ, దృష్టి మరల్చకుండా నా గమ్యం పైనే మనసు నిలిపాను. చివరకు నేను అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ క్షణంలో పూర్తిగా నిమగ్నమై దానిని ఆస్వాదించాను. నా మనసంతా ప్రశాంతత, స్పష్టతతో నిండిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది - మనం ప్రపంచంలోనే నంబర్ వన్ కానక్కర్లేదు, మనకి మనం నంబర్ వన్ అయితే చాలు. ఆ స్థాయిని చేరుకోవడమే అత్యున్నతమైన శిఖరం.
ఒక మంచి పర్వతారోహకుడిలాగే, ఇప్పుడు నేను అధిరోహించడానికి తర్వాతి పర్వతం కోసం వెతుకుతున్నాను. భవిష్యత్తు ఏమిటనే అనిశ్చితి కాస్త భయాన్ని కలిగిస్తోంది, అదే సమయంలో నాలో ఎంతో ఉత్సాహాన్ని కూడా నింపుతోంది. మా నాన్న స్టూడియోలోని ట్రాన్సిస్టర్ నుండి వచ్చే క్రికెట్ వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వినే ఆ చిన్న పిల్లాడిలా మళ్లీ మారిపోయాను.
మీరూ మీకు సరిపోయే సరైన పర్వతాన్ని మీరు కనుగొనాలని ఆశిస్తున్నాను. మీ ప్రయాణంలో ఇతరులకు తోడ్పాటును అందించండి, వారి మద్దతును స్వీకరించండి. మీరు ఎదుర్కొనే అనివార్యమైన ఎత్తుపల్లాలను ఓర్పుతో, పట్టుదలతో అధిగమించండి. అన్నింటికంటే ముఖ్యంగా... ఈ జీవన ప్రయాణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి.
— రాహుల్ ద్రవిడ్, convocation ప్రసంగం నుండి