Telugu Life

ఫొటోలు వేలల్లో... జ్ఞాపకాలు ఎక్కడ?

bheemkonduru ·

ఒకప్పుడు ఇంట్లో ఫొటో ఆల్బమ్ అంటే కుటుంబానికొక చిన్న ఆర్కైవ్ లాంటిది.

అందులో వందల ఫొటోలు ఉండేవి కావు. మహా అయితే యాభై, అరవై.

కానీ ఒక్కో ఫొటో వెనుక ఒక కథ ఉండేది.

“ఇది మీ మామయ్య పెళ్లిలో తీసింది.”

“ఆ రోజు ఉన్నట్టుండి వర్షం వచ్చి పందిరంతా పడిపోయింది.”

“ఈ ఫొటోలోని సైకిల్ గుర్తుందా? దీనిమీద నుంచే నువ్వు మొదటిసారి కిందపడ్డావు.”

“ఇక్కడ మీ నాన్నకి ఎంత జుట్టుందో చూడు!”

ఆల్బమ్ తెరిస్తే ఫొటోలు మాత్రమే కనిపించేవి కావు.

మాటలు మొదలయ్యేవి.

ఒక ఫొటో నుంచి ఇంకో జ్ఞాపకం. అక్కడి నుంచి ఇంకో మనిషి. అక్కడి నుంచి పాత గొడవలు, మధ్యలో నవ్వులు.

ఆల్బమ్ అనేది కేవలం స్టోరేజ్ స్పేస్ కాదు.

ఒక సంభాషణ.

ఇప్పుడు మన దగ్గర స్టోరేజ్ మాత్రం కొండంత ఉంది.

ఫోన్ తీసి గ్యాలరీ ఓపెన్ చేస్తే 18,000 ఫొటోలు ఉండొచ్చు. కొందరి దగ్గర 40,000 కూడా.

నిన్న తిన్న దోశ ఉంది.

మూడు నెలల క్రితం హోటల్ రూమ్ ఉంది.

ఏదో ఒకరోజు పార్కింగ్‌లో కారు ఎక్కడ పెట్టామో గుర్తుంచుకోవడానికి తీసిన ఫొటో కూడా పదిలంగా ఉంది.

ఒక అందమైన సూర్యాస్తమయానికి పదిహేడు వెర్షన్లు ఉంటాయి.

పుట్టినరోజు అనుకోండి...

కేక్ కట్ చేయడానికి ముందు ఒక ఫొటో.

క్యాండిల్స్ వెలిగించాక ఒక ఫొటో.

క్యాండిల్స్ ఊదుతున్నప్పుడు ఒక ఫొటో.

ఊదేసాక ఇంకొకటి.

ఇలా ఆ రోజులో ప్రతి క్షణమూ మన ఫోన్‌లో నిక్షిప్తమై ఉంటుంది.

కానీ... ఆ రోజు మన మనసులో ఎంత గుర్తుంది?


ఫొటోలు తీయడం ఇప్పుడు ఒక "అసంకల్పిత ప్రతీకార చర్య."[Reflex]

ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తాం.

మొదట తనివితీరా చూస్తామా?

చాలాసార్లు చూడట్లేదు.

ముందుగా చేతులు జేబులోకి వెళ్లి ఫోన్ తీస్తాయి.

మంచి యాంగిల్ వెతుకుతాం. ఇంకొంచెం వెనక్కి వెళ్తాం. పోర్ట్రెయిట్ మోడ్ పెడతాం. ఒకటి తీస్తాం, నచ్చదు. ఇంకొకటి.

వీడియో తీసే హడావుడిలో ఆ సూర్యాస్తమయం కాస్తా ముగుస్తుంది.

విచిత్రం ఏమిటంటే, మనం ఆ వీడియోను మళ్లీ ఎప్పటికీ చూడకపోవచ్చు.

అయినా సరే, ఆ క్షణంలో దాన్ని క్యాప్చర్ చేయడం అత్యవసరం అనిపిస్తుంది.

ఏదో ఒక చిన్న భయం...

ఇది రికార్డ్ చేయకపోతే జ్ఞాపకం చేజారిపోతుందేమోనని.

అందుకే జీవితాన్ని అనుభవించడంతో పాటు, దానికి ప్రూఫ్ కూడా సిద్ధం చేసుకుంటున్నాం.

ట్రిప్ జరిగింది... ఫొటో ఉంది.

బర్త్‌డే జరిగింది... వీడియో ఉంది.

పాప మొదటిసారి నడిచింది... క్లౌడ్ బ్యాకప్ ఉంది.

మన జీవితానికిప్పుడు 'డిజిటల్ రిసీట్స్' గుట్టలుగా పేరుకుపోయాయి.


కెమెరా మన తరఫున గుర్తుపెట్టుకుంటుందని మనసనుకుంటుందా?

ఫొటోలు తీయడం జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూసిన కొన్ని అధ్యయనాల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఏదైనా ఒక దృశ్యాన్ని కేవలం చూసినప్పుడు, దాని వివరాలు మనకు బాగా గుర్తుంటాయి. అదే దృశ్యాన్ని “కెమెరా ఉంది కదా” అన్నట్టు ఫోన్‌కు అప్పగించేసినప్పుడు, మన ఏకాగ్రత కాస్త తగ్గుతుంది.

ప్రతి సందర్భంలోనూ ఇదే జరుగుతుందని కాదు.

ఫొటోలను తర్వాత మళ్లీ చూసినప్పుడు మర్చిపోయిన వివరాలు తిరిగి గుర్తుకురావచ్చు, జ్ఞాపకాలు బలపడవచ్చు కూడా.

అంటే కెమెరా శత్రువు అని కాదు.

కానీ అది మెదడుకు ఒక షార్ట్‌కట్ అయిపోయింది.

“నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్‌లో ఉందిగా.”

ఫోన్ నంబర్ల విషయంలో జరిగిందే ఇక్కడా జరుగుతోంది.

ఒకప్పుడు పది మంది నంబర్లు నోటికే గుర్తుండేవి.

ఇప్పుడు మన సొంత పిల్లల నంబర్ల కోసం కూడా కాంటాక్ట్స్ లిస్ట్ వెతకాల్సి వస్తోంది.

జ్ఞాపకాల విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతుందేమో!


పాత ఆల్బమ్‌లో ఒక లిమిట్ ఉండేది

ఫిల్మ్ కెమెరా రోజుల్లో ప్రతి క్లిక్‌కీ ఖర్చు ఉండేది.

రోల్‌లో 24 లేదా 36 ఫొటోలు... అంతే!

అందుకే బర్త్‌డే వేడుక మొత్తం మీద 400 ఫొటోలు ఉండేవి కావు.

కేవలం మూడు.

టూర్‌కి వెళ్లి వచ్చిన తర్వాత ఎనిమిది.

అవి కూడా బ్లర్ అయితే అంతే సంగతులు; డిలీట్ చేసి ఇంకోటి తీసే అవకాశం లేదు.

ఆ లిమిట్ వల్ల, ఏ క్షణాన్ని తీయాలో ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లం.

ఇప్పుడు లిమిట్ లేదు.

అందుకే సెలక్షన్ కూడా లేదు.

ఒకే పిల్లాడి స్కూల్ ఫంక్షన్‌కి 147 ఫొటోలు.

అందులో బెస్ట్ ఫొటో ఏది?

ఎవరికీ తెలియదు.

ఎందుకంటే 147లో నాలుగో ఫొటో దగ్గరే మనకు స్వైప్ చేయడం విసుగొచ్చేస్తుంది.

కొన్నిసార్లు ఎక్కువ ఉండడం అనేది సంపద కాదు.

వెతకడానికి బద్ధకం వచ్చేంత డేటా పోగుపడటం కూడా ఒక సమస్యే.


మన ఫ్యామిలీ ఆల్బమ్స్ ఇప్పుడు ప్రైవేట్ వేర్‌హౌస్‌లు

పాత ఫొటోలను ఎక్కువగా అందరం కలిసి చూసేవాళ్లం.

ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే ఆల్బమ్ బయటకు వచ్చేది.

పిల్లలకు చూపించేవాళ్లం.

“ఇది మీ అమ్మ చిన్నప్పుడు.”

“ఇది మీ తాతయ్య.”

అలా ఒక తరం జ్ఞాపకాలు సహజంగానే ఇంకో తరానికి చేరేవి.

ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోలు వేలల్లో ఉన్నాయి.

కానీ ఎవరి ఫోన్‌లో వాళ్లకే విడివిడిగా బందీ అయిపోయాయి.

అమ్మ ఫోన్‌లో ఒక వెర్షన్.

నాన్న ఫోన్‌లో ఇంకో వెర్షన్.

వాట్సాప్‌లో కంప్రెస్డ్ వెర్షన్.

గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్.

హార్డ్ డిస్క్‌లో ఇంకో కాపీ.

జ్ఞాపకం మాత్రం ఎక్కడో ఫోల్డర్ల మధ్య దాక్కుంది.

స్టోరేజ్ పెరిగింది... కానీ అనుభూతులు తగ్గిపోయాయి.


కొన్ని జ్ఞాపకాలకు ఫొటోనే ఉండదు

మనకు జీవితంలో చాలా స్పష్టంగా గుర్తున్న క్షణాలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే... వాటిలో ఎక్కువ భాగానికి అసలు ఫొటోనే ఉండదు.

స్కూల్ అయిపోయిన చివరి రోజు.

స్నేహితుడితో కలిసి వేసిన లాంగ్ వాక్.

కరెంట్ పోయిన రాత్రి టెర్రస్ మీద కూర్చుని చూసిన ఆకాశం.

అమ్మ చేసి పెట్టిన ఒక మామూలు భోజనం.

ట్రైన్ విండో పక్కన కూర్చుని బయటకు చూస్తూ సాగిన ప్రయాణం.

ఎక్కడా ఫొటో లేదు.

కానీ ఆ సీన్ మాత్రం గుండెల్లో అలాగే ఉంది.

ఎందుకంటే అప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించలేదు.

అక్కడ సంపూర్ణంగా ఉన్నాం.

ఆ వాసనలో...

ఆ మాటల్లో...

ఆ నిశ్శబ్దంలో...

మన అటెన్షన్ మొత్తం అక్కడే ఉంది.

బహుశా ప్రతి క్షణాన్నీ ఫొటో తీయడం తప్పు కాకపోవచ్చు.

కానీ ప్రతి క్షణాన్నీ ఒక ఫొటోగా మార్చడమే జీవితం అనుకున్నప్పుడే తేడా మొదలవుతుంది.

బర్త్‌డేకి ఫొటోలు కావాలి.

ట్రావెల్ చేసినప్పుడు కావాలి.

పిల్లలు పెద్దయ్యాక చిన్నప్పటి వీడియోలు చూసుకోవడం కూడా అద్భుతమైన ఫీలింగే.

కానీ మధ్యలో కొన్ని క్షణాలకు కెమెరా రోల్‌లో చోటు లేకపోయినా పర్వాలేదు.

ఎందుకంటే జీవితంలోని కొన్ని మంచి జ్ఞాపకాలకు రెజల్యూషన్ ఉండదు.

డేట్ స్టాంప్ ఉండదు.

బ్యాకప్ అంతకంటే ఉండదు.

అవి ఎక్కడ సేవ్ అయ్యాయో కూడా మనకు తెలియదు.

ఏళ్ల తర్వాత ఏదో ఒక పాట విన్నప్పుడు ఒక్కసారిగా బయటకు తన్నుకొస్తాయి.

అంతే!

అప్పుడే అర్థమవుతుంది -

ఫొటో లేకపోయినా, ఆ రోజు మన మనసులోనే పదిలంగా ఉందని.