ప్రశాంతత ఎక్కడో బయట దొరికేది కాదు
bheemkonduru ·

జీవితం చాలా గందరగోళంగా, చికాకుగా అనిపించినప్పుడు,
కాస్త ప్రశాంతత కావాలి అనిపించినప్పుడు.
మనం సాధారణంగా ఏమి చేస్తాం?
ఒక మంచి vacation ప్లాన్ చేసుకుంటాం.
ఫోన్ పక్కన పెడదాం అనుకుంటాం.
రోజువారి చిరాకులు పరాకులకు కాస్త దూరంగా వెళ్ళాలి అనుకుంటాం.
ఎక్కడికైనా వెళ్లి కొన్నిరోజులు మౌనంగా ఉండాలని అనుకుంటాం, ఇంకా ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న వాళ్లు "silent retreat" కు వెళ్తారు.
మన దృష్టిలో ప్రశాంతత ఎక్కడో బయట దొరుకుతుంది, దానికి మనం సాధించాలి.
చాలా సందర్భాల్లో మనకు కావాల్సింది ప్రశాంతతను సాధించడం కాదు.
మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం.
ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని గుర్తించడం.
ప్రతి అపార్థాన్ని సరిచేయడానికి ప్రయత్నించకపోవడం.
ప్రతి వాదనలో మనమే సరైనవాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వదిలేయడం.
మనకు ఇష్టమైన హీరో సినిమాలు ఆడడం, ఆడకపోవడం.
మనకు నచ్చిన పార్టీ గెలవడం, గెలవకపోవడం.
మనం నిజం అని నమ్మిన దాన్ని అందరూ ఆమోదించకపోవడం.
మీరు పడిన కష్టాన్ని మీరు కోరుకునే వారు గుర్తించకపోవడం.
ఇలా జీవితంలో ఎన్నో విషయాలు మన చేతిలో ఉండవు
మనం అనుకున్నట్లు లేదా కోరుకున్నట్లు జరగని విషయాల పట్ల మన వైఖరి మన చేతుల్లోనే ఉంటుంది.
ఏ విషయాలను పట్టించుకోవాలో కాదు, ఏం పట్టించుకోకూడదో కూడా తెలుసుకోవడం ముఖ్యం
ఏం వదిలేయాలో తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వెనక్కి రావాలో తెలుసుకోవడం.
మన మనసుకు ప్రతీ విషయానికీ స్పందించే అలవాటు ఉంటుంది.
ఎవరో ఒక మాట అన్నారు — మనం రోజంతా దాని గురించి ఆలోచిస్తాం.
ఒక మెసేజ్‌కి reply రాలేదు — దాని వెనుక కారణాలతో ఓ పుస్తకం రాసేస్తాం
ఎవరో మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు — మనసులోనే వాళ్లతో మరో మూడు conversations చేసేస్తాం.
బాహ్యంగా ఏమి జరగడం లేదు.
కానీ మన లోపల మాత్రం full-time meeting నడుస్తూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో, మన అశాంతికి ఇదే కారణం.
ప్రశాంతత అంటే ఆలోచించడం మానేయడం కాదు
అసంకల్పితంగా మనసులో వచ్చే ఇటువంటి ఆలోచనలకు అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం.
కొన్ని విషయాలు మనం మార్చలేము.
కొంతమంది మనల్ని అర్థం చేసుకోరు.
కొన్ని విషయాలు మనకు నచ్చినట్టుగా జరగవు.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రావు.
అయినా మనం వాటన్నింటికీ మన కాలాన్ని అద్దెకు ఇవ్వాల్సిన అవసరం లేదు.
మనం కోరుకునే ప్రశాంతత బయట ఎక్కడో దొరికేది కాదు.
ప్రతిరోజూ మనం ఎంచుకునే "choices" లో ఉంటుంది.
దేనికి స్పందించాలి.
దేనిని వదిలేయాలి.
దేనిమీద మనసు పెట్టాలి.
దేనిని పట్టించుకోకూడదు.
ఈ విషయాల్లో మనం స్పష్టత సాధించాలి.
ప్రశాంతత అంటే మన చుట్టూ ప్రపంచం నిశ్శబ్దంగా, మౌనంగా, మనకు నచ్చినట్లుగా మారడం కాదు.
నిరంతరం మనస్సు చేసే రణగొణ ధ్వనులకు మనం ప్రతిస్పందించక పోవడం.