Telugu Life

అభిప్రాయాలు...పరిస్థితులు...

telugulife ·

ఆటోలో కూర్చున్నప్పుడు రోడ్డు మీద నడిచేవాళ్లని చూస్తే చిరాకు వస్తుంది.
“కొంచెం పక్కకు నడవొచ్చు కదా! రోడ్డు మధ్యలో ఎందుకు?”

ఆటో దిగి నాలుగు అడుగులు వేస్తాం. వెనక నుంచి హారన్.
“ఏంటో ఈ ఆటోవాళ్లు. మనుషుల్ని రోడ్డు మీద నడవనివ్వరు.”

ఐదు నిమిషాలు. అంతే.
అభిప్రాయం కంప్లీట్‌గా మారిపోయింది.

మనం చాలా విషయాల్లో మనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని అనుకుంటాం. కానీ వాటిలో కొన్ని మనం ఉన్న స్థానాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి.

క్యూలో మనం కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు మన సందేహాలన్నీ సావధానంగా తీర్చుకోవాలి అనిపిస్తుంది.
అదే మనకంటే ముందున్నవాళ్లు కౌంటర్ దగ్గర ఉంటే—
“ఇన్ని doubts ఎందుకు? ఇంటి దగ్గరే ఆలోచించుకుని రావచ్చు కదా. Google చేయొచ్చు కదా!”

ఒకే క్యూ. ఒకే మనిషి. రెండు వేర్వేరు కథలు.

ఒకే గది, రెండు వాతావరణాలు
ఇంట్లో కూడా ఇదే.
ఒకరికి AC ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర ఉక్కపోస్తుంది. ఇంకొకరు అదే ఇరవై నాలుగులో దుప్పటి కప్పుకుని, “ఇది ఇల్లా, ఫ్రీజరా?” అంటారు.
ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. వాతావరణం మాత్రం ఇద్దరికీ వేరు.

పెళ్లిళ్లలో ఈ తేడా ఇంకా బాగా కనిపిస్తుంది.
అతిథిగా వెళ్తే, “భోజనంలో ఇంకో sweet ఉంటే బాగుండేది” అనిపిస్తుంది.
పెళ్లి చేస్తున్నవాళ్లయితే, “ఉన్న రెండు sweets లో ఒకటి సగం మంది ముట్టుకోలేదు” అని బాధపడతారు.

ఫోటోగ్రాఫర్‌కి అందరూ దగ్గరగా నిలబడాలి. మనకు మాత్రం పక్కవాళ్ల మోచేయి కడుపులో గుచ్చుకోకుండా ఉంటే చాలు.
అందరికీ పెళ్లి బాగా జరగాలనే ఉంటుంది.
“బాగా” అంటే ఏమిటన్న దగ్గరే చిన్న తేడా.

ఈ తేడా బయటివాళ్లతోనే కాదు
నిన్నటి మనకీ, ఇవాళ్టి మనకీ కూడా ఉంటుంది.

ఆదివారం మధ్యాహ్నం friend నుంచి ఫోన్.
“బయటకు వెళ్దామా?”
మనుషుల్ని కలవడం ఎంత అవసరమో వెంటనే గుర్తొస్తుంది. మనిషి సంఘజీవి కదా ఎక్కడో చదివిన విషయం గుర్తుకువస్తుంది.
స్నానం చేసి, బట్టలు మార్చుకుని, తాళాలు వెతికే సరికి… ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

రెండు అభిప్రాయాలూ మనవే.
మధ్యలో జీన్స్ వేసుకున్నాం అంతే!

అయినా ఎదుటివాళ్ల విషయానికి వచ్చేసరికి తీర్పు చాలా త్వరగా చెప్పేస్తాం.
ఫోన్ ఎత్తలేదంటే—“వాడికి పొగరు.”
మెసేజ్‌కి చిన్న reply ఇస్తే—“కోపంగా ఉన్నాడు.”
Function కి రాకపోతే—“మనమంటే లెక్కలేదు.”

వారి దగ్గర ఏం జరుగుతోందో మనకు తెలియదు. కానీ మన దగ్గర అప్పటికే ఒక కథ సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే పాత సంఘటనలను కూడా సాక్ష్యాలుగా తెచ్చి పెడతాం.

అదే మనం ఫోన్ ఎత్తకపోతే?
“నిజంగానే పని ఉంది.”
చిన్న reply ఇస్తే?
“Type చేసే ఓపిక లేదు.”
Function కి వెళ్లకపోతే?
“ఆదివారం ఒక్క రోజైనా ఇంట్లో ఉండాలనిపించింది.”

మన కథలో మనకు అన్ని వివరాలూ తెలుసు.
అవతలివాళ్ల కథలో కనిపించిన చిన్న ముక్కతోనే మిగతాదంతా రాసేస్తాం.

అలాగని ప్రతి విషయాన్నీ అన్ని వైపుల నుంచి ఆలోచిస్తూ, ప్రతి చిన్న గొడవకీ మనసులో మీటింగ్‌ పెట్టుకోవాల్సిన పని లేదు.
కొన్నిసార్లు “ఏమో, వాళ్ల సంగతి ఏంటో” అని వదిలేయొచ్చు.

ఎందుకంటే మన అభిప్రాయాలు తప్పని కాదు.
కానీ వాటిలో కొన్ని పూర్తిగా మనవి కాకపోవచ్చు.
ఆ క్షణంలో మనం కూర్చున్న కుర్చీవి కావచ్చు.

ఆటో దిగిన ఐదు నిమిషాలకే మారిపోయే అభిప్రాయానికి, ఐదు నిమిషాల ముందు మనం ఇచ్చిన buildup గుర్తొస్తే మాత్రం కొంచెం నవ్వొస్తుంది.