Telugu Life

ఒకసారి.. ఒక్క పనే చేద్దాం!

bheemkonduru ·

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి నిమిషం విలువైనదే. ఆదరాబాదరాగా అన్నీ ఒకేసారి పూర్తి చేయాలనే కంగారులో, ఏ పనీ సరిగ్గా చేయలేక మనం తరచూ సతమతమవుతున్నాం. ఒక చేత్తో మొబైల్, మరో చేతిలో లాప్‌టాప్‌, బుర్రలో వంద ఆలోచనలు.. ఇలా గడిచిపోతోంది మన దినచర్య. కానీ, ఈ 'మల్టీ టాస్కింగ్' మన సమయాన్ని ఆదా చేయడం కంటే, ఒత్తిడినే ఎక్కువగా పెంచుతోందని ఎప్పుడైనా గమనించామా? అన్నీ ఒకేసారి చక్కబెట్టాలన్న ఆరాటం కొన్నిసార్లు అసలుకే మోసం తెస్తుంది. వర్తమానంలో జీవిస్తూ, కళ్ల ముందున్న పనిపై మాత్రమే ఏకాగ్రత నిలపడం మనసుకూ, మనం చేసే పనికీ ఎంతో శ్రేయస్కరం. ఈ ఉరుకుల పరుగులకు చిన్న బ్రేక్ ఇచ్చి, మన పనులను మరింత సమర్థవంతంగా, ప్రశాంతంగా పూర్తిచేసుకోవడానికి ఈ చిన్న సూత్రాలు పాటిద్దాం..

  1. ప్రస్తుతం చెయ్యాల్సిన పని మీద దృష్టి పెడదాం
    తర్వాత ఏం చేయాలి? రేపేం జరుగుతుంది? తదితర ఆలోచనలను కాసేపు పక్కనపెట్టి, చేతిలో ఉన్న పనికి మాత్రమే మనం ప్రాధాన్యం ఇద్దాం.
  2. పనుల జాబితాను బుర్రలో మోయకుండా ఉందాం
    మనం చేయాల్సిన పనులు పది ఉండొచ్చు. కానీ, ఈ క్షణంలో మనం చేయగలిగేది ఒక్కటేనన్న విషయాన్ని గ్రహిద్దాం.
  3. ఏదైనా పని - ఎంత చిన్నదైనా - ముందు పూర్తిచేద్దాం
    అది ఒక ఈ-మెయిల్ పంపడం కావచ్చు.. ఒక ఫోన్ కాల్ మాట్లాడటం లేదా ఒక పేజీ చదవడం కావచ్చు. పని చిన్నదైనా సరే ముందు దాన్ని పూర్తిచేద్దాం.
  4. మల్టీ టాస్కింగ్'కు కాస్త విరామం ఇద్దాం
    ఒకవైపు పని చేస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు, సందేశాలు చూస్తుంటే బిజీగా ఉన్నట్లు అనిపిస్తుందే తప్ప, ఏ పనీ కొలిక్కి రాదు. ఈ అలవాటును క్రమంగా వదిలించుకుందాం.
  5. రోజంతటినీ ముందే ఊహించుకోకూడదు
    సాయంత్రం జరగబోయే మీటింగ్‌ గురించి ఉదయం నుంచే ఆందోళన చెందడం అంటే.. ఇంకా రాని సమయాన్ని ఇప్పుడే వృథా చేసుకోవడమే. ఆ భారాన్ని ఇప్పటినుండి మోయకుండా ఉందాం.
  6. ‘ఇంకెంత ఉంది?’ కాదు.. ‘ఇప్పుడేం చేయాలి?’
    ఇంకెంత పని మిగిలి ఉందన్న ఆలోచన కన్నా.. 'ఇప్పుడు మనం ఏ పని చేయాలి?' అని ప్రశ్నించుకుంటే మనలోని గందరగోళం సగానికి తగ్గుతుంది.
  7. చిన్న అడుగులను తక్కువ అంచనా వేయకూడదు
    ఎంత బృహత్తర కార్యమైనా సరే.. చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారానే పూర్తవుతుందన్న విషయాన్ని మనం మరువకూడదు.
  8. మనసు పక్కకు మళ్లితే.. మళ్లీ వెనక్కి తెద్దాం
    మెదడు మిగిలిన పనుల గురించి పదే పదే గుర్తుచేయడం సహజమే. అలాంటప్పుడు మనసును నిగ్రహించి, మళ్లీ ప్రస్తుత పనిపైకి మళ్లించే ప్రయత్నం చేద్దాం.
  9. అన్నీ ఇవాళే పూర్తి కావాల్సిన పనిలేదు
    మనం కొన్ని పనులు రేపటికైనా వాయిదా వేసుకోవచ్చు. అంతమాత్రాన ప్రపంచమేమీ ఆగిపోదు!
  10. ఒకదాని తర్వాతే మరొకటి
    రోజు మొత్తాన్ని మన గుప్పిట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పని పూర్తయ్యాకే మరో పనికి వెళదాం.

మనం యంత్రాలం కాదు, మనుషులం. ఒక రోజులో అద్భుతాలు సృష్టించలేకపోయినా పర్వాలేదు కానీ, చేస్తున్న పనిని ప్రశాంతంగా చేయడం ముఖ్యం. కొన్నిసార్లు మనల్ని అలసిపోయేలా చేసేది మనం చేసే పని కాదు.. ఇంకా చేయని పనుల భారాన్ని మెదడులో మోయడమే! గమ్యం చేరాలన్న ఆరాటంలో ప్రయాణాన్ని ఆస్వాదించడం మర్చిపోకూడదు కదా! అందుకే, బరువెక్కిన బుర్రను కాస్త తేలిక చేసి, 'రేపు' అనే ఆందోళనను పక్కనపెడదాం.

ప్రస్తుతానికి మన ముందున్న ఆ 'ఒక్క పని'తోనే మళ్లీ మొదలుపెడదాం. అది పూర్తయ్యాకే.. తదుపరి పని గురించి ఆలోచిద్దాం!