ఒక భయం. ఒక భ్రమ.
bheemkonduru ·

రెండు వేల ఏళ్ల క్రితం ఎపిక్యుటస్ ఈ మాట చెప్పాడు
అతనో బానిస..
అతనికి సంపద లేదు. పదవి లేదు. స్వేచ్ఛ కూడా లేదు.
కానీ స్వేచ్ఛగా పుట్టిన మనుషులు తమ మనసులో తామే కట్టుకునే జైళ్లను మాత్రం అతను అద్భుతంగా అర్థం చేసుకున్నాడు.
మనల్ని బంధించేది సమాజం కాదు.
మన ఊహలు.
మనిషి పడే ఉచ్చులు రెండే అని ఎపిక్యుటస్ చెప్పాడు.
మొదటిది –"నలుగురు ఏమనుకుంటారు?" అనే భయం.
రెండోది –"నలుగురూ నా గురించే ఆలోచిస్తున్నారు." అనే భ్రమ.
రెండోది మొదటి దానికంటే ప్రమాదకరం.
ఎందుకంటే అది పూర్తిగా అవాస్తవం.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి.
మీరు చేసిన తప్పులను కాదు.
భయంతో చేయకుండా వదిలేసిన పనులు.
ప్రారంభించని వ్యాపారం.
రాయకుండా వదిలేసిన పుస్తకం.
నేర్చుకోకుండా వదిలేసిన కళ.
"జనం నవ్వుతారు" అని చంపేసుకున్న ఒక కల.
ఇప్పుడు మీరే చెప్పండి.
ఆ రోజు మిమ్మల్ని చూసి ఏదో అనుకున్న ఆ వ్యక్తి...
ఈరోజు మీ గురించి గుర్తు పెట్టుకుని ఉంటాడా?
బహుశా లేదు.
ఎందుకంటే ప్రతి మనిషీ తన జీవితంతోనే బిజీగా ఉన్నాడు.
మీరు మీ గురించి ఎంత ఆలోచిస్తారో...
వాళ్లు వాళ్ల గురించి అంతే ఆలోచిస్తారు.
మీరు ఊహించిన 'నలుగురి న్యాయస్థానం'లో న్యాయమూర్తులు లేరు.
ప్రేక్షకులు కూడా లేరు.
ప్రతి ఒక్కరూ తమ కేసులో తామే ముద్దాయిలు.
అదే ఈ భ్రమలోని విచిత్రం.
ఈ భ్రాంతుల నుండి
విముక్తి కూడా రెండు అడుగులే.
మొదటిది
ఇతరుల అభిప్రాయం మీ జీవితాన్ని మార్చదు.
అది మీ బిల్లులు కట్టదు.
మీ బాధను తగ్గించదు.
మీ కోల్పోయిన సమయాన్ని తిరిగి ఇవ్వదు.
అది ఒక అభిప్రాయం మాత్రమే.
నిజం కాదు.
రెండోది
వాళ్లు అసలు మీ గురించి అంతగా ఆలోచించడం లేదు.
వాళ్ల మనసులో మీకున్న పాత్ర...
మీ ఊహలో ఉన్నంత పెద్దది కాదు.
ఇది తెలుసుకున్న రోజు నుంచి జీవించడం తేలికవుతుంది.
సిగ్గు తగ్గుతుంది.
ప్రయత్నాలు పెరుగుతాయి.
ఓడిపోవడానికి ధైర్యం వస్తుంది.
మళ్లీ లేవడానికి కూడా.
చివరికి ప్రతి మనిషి ఒక నిశ్శబ్దమైన గదికి చేరుకుంటాడు.
అప్పుడు చప్పట్లు ఉండవు.
విమర్శలు ఉండవు.
నలుగురూ ఉండరు.
మిగిలేది ఒక్కటే.
మీరు నిజంగా జీవించిన జీవితం.
ఎపిక్యుటస్‌కు స్వేచ్ఛ లేదు.
కానీ ఒక గొప్ప స్వాతంత్ర్యం ఉంది.
మనకు సంకెళ్ళ వేసింది ప్రపంచం కాదు.
మనమే నమ్ముకున్న భయం.
మనమే సృష్టించుకున్న భ్రమ.
అవి రెండూ మనసులో పుట్టాయి.
ఈ సంకెళ్ళు తొలగించుకునే తాళం చెవి కూడా మన చేతుల్లోనే ఉంది.