Telugu Life

నిరాశ సమస్య కాదు

bheemkonduru ·

జీవితంలో నిరాశపడని మనిషి ఉండడు.
మనం అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు.
అపురూపం అనుకున్న సంబంధం నిలవకపోవచ్చు.
ఎంతో శ్రమించిన పని ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు.

నిరాశ సహజం.
అది జీవితంలో భాగం.

కానీ...

నిరాశతోపాటు మరో ప్రమాదం పొంచివుంటుంది.
అది నిందించడం, blame చెయ్యడం

ఏదైనా తప్పు జరిగితే మనసు వెంటనే ఒక కారణం వెతుకుతుంది.
"అతని వల్ల."
"వాళ్లు అలా చేయకపోయి ఉంటే."
"కాలం కలిసిరాలేదు."
"అదృష్టం లేదు."

ఎవరో ఒకరిని కారణంగా భావిస్తే మన బాధ కొద్దిసేపు తేలిక అవుతుంది.
కానీ మన జీవితం మాత్రం ముందుకు కదలదు.

నిందించడం అంటే బాధ్యత వదిలిపెట్టడం

బాధ్యత లేని చోట...
మార్పుకు అవకాశం ఉండదు.

ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం మార్చగలిగేది మనల్ని మాత్రమే.

ఒక పరీక్షలో fail అయితే...
ప్రశ్నాపత్రాన్ని నిందించడం వల్ల మార్కులు పెరగవు.
ఒక వ్యాపారం నష్టపోతే...
మార్కెట్‌ను తిట్టడం వల్ల లాభాలు రావు.
ఒక సంబంధం ముక్కలయితే...
ఎదుటివారిని జీవితాంతం తప్పుపట్టడం వల్ల మనసు మళ్లీ ప్రేమించడం నేర్చుకోదు.

నిందించడం చాలా సులభం.
ఎందుకంటే అది మన ఈగోని కాపాడుతుంది.
"తప్పు నాది కాదు" అని చెప్పే అవకాశం ఇస్తుంది.
కానీ ఎదుగుదల...
ఆ వాక్యంతో మొదలవదు.
"ఇక్కడ నేను ఏమి నేర్చుకోవచ్చు?" అనే ప్రశ్నతో మొదలవుతుంది.

ప్రతి నిరాశలో రెండు దారులు ఉంటాయి.
ఒకటి...
ఎవరినో తప్పుపట్టడం.
మరొకటి...
తర్వాతి అడుగుకు సిద్ధం కావడం.
మొదటి దారి మన కోపాన్ని పెంచుతుంది.
రెండో దారి మన సామర్థ్యాన్ని పెంచుతుంది.

జీవితంలో ఎన్నో నిరాశలు ఎదురవుతాయి, అన్నింటిని మనం మనం ఆపలేము.
కానీ ప్రతి నిరాశ తర్వాత మన స్పందనను మాత్రం ఎంచుకోవచ్చు.
అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఎందుకంటే...
నిరాశ మనల్ని ఆపదు.
ఎవరినో కారణంగా చూసి నిందించే అలవాటే మనల్ని ఎప్పటికీ ఉన్నచోటనే నిలబెడుతుంది.