Telugu Life

నిజమైన ఆత్మగౌరవం: మన మాట మీద మనం నిలబడటం

bheemkonduru ·

ఈ రోజుల్లో "ఆత్మగౌరవం" (Self-Respect) అనే పదాన్ని చాలా సులువుగా వాడేస్తున్నాం. మనం చాలాసార్లు ఆ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని మనం అనుకుంటున్నామో "అటువంటి ప్రవర్తనను" వారి వద్ద నుండి రకరకాల రూపంలో డిమాండ్ చేయడం, లేదా మన గొప్పతనాన్ని ఎదుటివారిపై రుద్దడం ఆత్మగౌరవం అని భావిస్తున్నాం. ఎదుటివారి నుండి మర్యాదను ఆశించడం తప్పేం కాదు, కానీ నిజమైన ఆత్మగౌరవం అనేది బయటి ప్రపంచం మనకిచ్చేది కాదు. అది మన అంతరంగంలో రూపుదిద్దుకునే ఒక నిశ్శబ్దమైన శక్తి.


✦

మనకు మనం ఇచ్చే గౌరవం ఎంత?

నిజమైన ఆత్మగౌరవం, ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానితో ప్రారంభం కాదు; అది మనం మనతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ముఖ్యంగా, మన సొంత మాటకు మనం ఎంత విలువ ఇస్తున్నాం అనే దానితో ఆరంభమవుతుంది. మనం సమాజం నుండి గౌరవాన్ని డిమాండ్ చేయడానికి ముందు, లేదా మన అహంకారాన్ని (Ego) ఆత్మగౌరవంగా పొరబడకముందు, మనం మనకు పెట్టుకున్న నియమాలను, మనకు మనం చేసుకున్న వాగ్దానాలను ఎంతవరకు గౌరవిస్తున్నామో తరచి చూసుకోవాలి.

మనం ప్రతిరోజూ మనకు మనం ఎన్నో చిన్న చిన్న వాగ్దానాలు చేసుకుంటాం. "అలారం మోగిన వెంటనే నిద్రలేస్తాను," "ఈ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తింటాను," "సమయం వృథా చేయకుండా ఈ పని పూర్తి చేస్తాను," "మన కోపాన్ని అదుపులో ఉంచుకుంటాను."

పైకి ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. కానీ, మనకు మనం చేసుకున్న ఈ చిన్న ప్రామిస్‌లు నెరవేర్చని ప్రతిసారీ, మన ఆత్మవిశ్వాసంలో ఒక చిన్న పగులు ఏర్పడుతుంది. దీనిద్వారా మనం మన మనసుకి పరోక్షంగా ఏం చెబుతున్నామంటే: "నా మాటకు విలువ లేదు. నన్ను నేనే నమ్మలేను."

రోజూ కాసేపు నడవాలి అనే చిన్న ప్రామిస్‌నే మనం నిలబెట్టుకోలేకపోతే, జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి మన మీద మనకు నమ్మకం ఎలా వస్తుంది? నిజమైన ఆత్మగౌరవం అనేది 'నిజాయితీ' (Integrity) అనే పునాదిపై నిర్మించబడుతుంది. ఎవరూ చూడకపోయినా, మనకు మనం అనుకున్న పనిని పూర్తి చేయగలగడమే నిజమైన నిజాయితీ.


✦

అహంకారం (Ego) vs ఆత్మగౌరవం (Self-Respect)

ఎప్పుడైతే ఈ అంతర్గత పునాది లోపిస్తుందో—అంటే మనల్ని మనమే నిరంతరం నిరాశపరుచుకుంటామో—మనలో ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' (Ego) ముందుకు వస్తుంది.

అహంకారానికి గొంతు ఎక్కువ; కానీ ఆత్మగౌరవం నిశ్శబ్దంగా వ్యక్తమవుతుంది. అహంకారం అభద్రతా భావంతో ఉంటుంది కాబట్టి దానికి అందరి దృష్టి కావాలి. అది పొగరును ఆత్మవిశ్వాసంగా భ్రమపడుతుంది. అహంకారంతో నడిచే వ్యక్తులు తరచుగా గౌరవాన్ని గట్టిగా "డిమాండ్" చేస్తారు, ఎందుకంటే వారి లోపల ఉన్న శూన్యతను ఇతరులకు కనిపిస్తుందని భయపడతారు. వారికి ఆత్మగౌరవం ఒక ముసుగులా ఉపయోగపడుతుంది, చిన్న విషయాలకే నొచ్చుకుంటారు, ఇతరుల గుర్తింపు కోసం ఎప్పుడూ పాకులాడుతారు.


✦

క్రమశిక్షణ నుండి పుట్టిన ఆత్మగౌరవం

కానీ, మనకు మనం చేసుకునే వాగ్దానాలను నిలబెట్టుకునే క్రమశిక్షణ నుండి పుట్టిన ఆత్మగౌరవానికి ఎవరి చప్పట్లూ అవసరం లేదు.

మన విలువ మనకు తెలిసినపుడు, ఇతరులు దానిని గుర్తించాలని తాపత్రయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజూ మన చేతల ద్వారా, మన క్రమశిక్షణ ద్వారా మనకు మనమే దానిని నిరూపించుకుంటూ ఉంటాం.

ఆ నిరూపణ బయటి ప్రపంచం కోసం కాదు—మన కోసం. అది నెమ్మదిగా మన అస్తిత్వంలోనే భాగమై, మనల్ని మనం చూసుకునే దృష్టినే మార్చేస్తుంది.


✦

చివరగా

చివరగా చెప్పాలంటే, ఆత్మగౌరవం అంటే మనతో మనకు ఉన్న సంబంధం—మన పట్ల మనకుండే గౌరవం. ఈ బంధమే అన్నింటికంటే ముఖ్యమైనది.

మనం చెక్కుచెదరని ఆత్మగౌరవాన్ని సాధించాలంటే, కాసేపు బయటి ప్రపంచం వైపు చూడటం మానేద్దాం. ముందు మన మాట మీద మనం నిలబడదాం. అలారం మోగినప్పుడు లేద్దాం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, దానిని పూర్తి చేద్దాం. మనతో మనం చేసుకున్న ఒప్పందాలను గౌరవించడం ద్వారా, మనకు మనపై నమ్మకం కలుగుతుంది.

ఎప్పుడైతే మనం మన మాటను గౌరవిస్తామో, అప్పుడే మనం నిజంగా తలెత్తుకుని నడవగలం. అది అహంకారంతో కాదు, "నేను నా మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని" అనే ప్రశాంతమైన నిశ్చయంతో ముందుకు సాగుతాం.

నిజమైన ఆత్మగౌరవానికి అదే మొదటి అడుగు.