మన ఉద్యోగం మన గురించి చెప్పేది ఎంత?
bheemkonduru ·

“ఏం చేస్తారు?”
కొత్తగా ఎవరినైనా కలిసినప్పుడు మనం అడిగే ప్రశ్నల్లో ఇది చాలా సాధారణం.
“మీ పేరు ఏంటి?”
“ఎక్కడుంటారు?”
అని అడిగిన వెంటనే,
“మీరు ఏం చేస్తారు?” అని అడుగుతాం. అవతలి వ్యక్తి కూడా పెద్దగా ఆలోచించకుండా తన job title చెప్పేస్తాడు.
“సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాను.”
“బిజినెస్ చేస్తున్నాను.”
“బ్యాంకింగ్.”
“గవర్నమెంట్ జాబ్.”
“ఫలానా కంపెనీలో మేనేజర్.”
అంతే.
కొన్ని సెకన్లలో ఒక మనిషి గురించి మనకు తెలిసిపోయిందనుకుంటాం.
నిజానికి - అతను రోజుకు ఎనిమిది గంటలు ఏం చేస్తాడో తెలుసుకున్నాం. కానీ మిగతా పదహారు గంటల్లో అతడు ఎవరో ఏమిటో మనకు తెలియదు.
మన జీవితంలో ఉద్యోగం ఎప్పుడో ఒక పని కాకుండా మన అస్థిత్వంగా మారిపోయింది.
పిల్లల్ని చిన్నప్పటి నుంచే అడుగుతాం.
“పెద్దయ్యాక ఏం అవుతావు?”
డాక్టర్ అవుతావా?
ఇంజనీర్ అవుతావా?
ఐఏఎస్ అవుతావా?
అంతేకానీ, “ఎలాంటి మనిషిగా ఎదుగుతావు?” అని అడగం.
“ఏం అవుతావు?” అని అడుగుతాం.
పెద్దయ్యాక కూడా అదే ప్రశ్న వెంబడిస్తుంది.
చిన్నప్పుడు “ఏం అవుతావు?” అని అడిగిన వాళ్లే పెద్దయ్యాక “ఏం చేస్తున్నావు?” అని అడుగుతారు.
ఈ మధ్యలో మనం మన చేస్తున్న, లేదా చేయబోయే జాబ్ మన identity అని నిర్ధారణకు వచ్చేస్తాం.
ఉద్యోగాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
దానివలన డబ్బు వస్తుంది
స్వతంత్రంగా ఉండే అవకాశం ఇస్తుంది.
కొన్ని ఉద్యోగాలు మనకి నిజంగానే ఇష్టంగా ఉంటాయి
కొంతమంది తమ ఉద్యోగం ద్వారా చాలా సంతృప్తి పొందుతారు.
తమ పని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల కళ్లలో కనిపించే మెరుపు చూస్తే, వారికది “కేవలం ఉద్యోగం కాదు” అనిపిస్తుంది.
అందులో తప్పేమీ లేదు.
సమస్య అక్కడ మొదలవదు.
సమస్య ఏమిటంటే — ఉద్యోగం మన జీవితంలో ఒక భాగంగా ఉండాల్సింది, మొత్తం జీవితానికి అర్థం చెప్పే ప్రమాణంగా మారిపోతోంది.
ప్రమోషన్ వస్తే మనం సంతోషిస్తాం.
అది సహజం.
కానీ కొన్నిసార్లు ప్రమోషన్ మన శాలరీని మాత్రమే పెంచదు.
మన self-worthని కూడా పెంచినట్టుగా అనిపిస్తుంది.
Designation మారుతుంది.
మన గురించి మన అభిప్రాయం మారుతుంది.
కొత్త కారు కొంటాం.
కొత్త ఫోన్ కొంటాం.
LinkedInలో కొత్త title పెడతాం.
మనకి మనమే కొంచెం కొత్త మనిషిలా అనిపిస్తుంది.
అలాగే, ఏదో ఒకరోజు job పోతే?
అప్పుడు నష్టం కేవలం శాలరీ మాత్రమే కాదు.
“ఇప్పుడు నేను ఏంటి?”
అనే ప్రశ్న కూడా వస్తుంది.
మనలో చాలామంది మనతో మనం bargain చేసుకుంటాం.
“ఇంకొంచెం కష్టపడదాం. తర్వాత బాగా జీవిద్దాం.”
ఈ “తర్వాత”కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది.
అది ఎప్పుడూ ముందుకే పోతూ ఉంటుంది.
ఈ project అయిపోతే.
ఈ promotion వస్తే.
ఈ appraisal పూర్తయితే.
ఈ loan కాస్త తీరితే.
ఈ financial target చేరితే.
ఇంకో మంచి position వస్తే.
అలా మనం జీవితం మొదలుపెట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాం.
కానీ మధ్యలో జీవితం ఏం చేస్తుంది?
దోసిట్లో నీళ్ళలా జారిపోతుంది.
పిల్లాడు ఏదో చెప్పడానికి వచ్చాడు.
“ఒక్క నిమిషం.”
భార్య ఏదో మాట్లాడాలనుకుంది.
“ఇప్పుడొద్దు, చాలా tiredగా ఉన్నాను.”
స్నేహితుడు చాలా రోజుల తర్వాత కలుద్దామన్నాడు.
“ఈ weekend చూద్దాం.”
అమ్మ ఫోన్ చేసింది.
“తర్వాత మాట్లాడతా.”
ఆ “తర్వాత”ల్లోనే మన జీవితంలోని చాలా భాగం నిశ్శబ్దంగా వెళ్లిపోతుంది.
ఇంకో చిత్రమైన విషయం మరొకటి ఉంది.
మనం work నుంచి బయటపడటానికి సెలవులు తీసుకుంటాం.
కానీ work మన మనస్సు నుంచి బయటికి రావడానికి సెలవులు సరిపోవు.
వీకెండ్‌లో కూడా Monday గురించి ఆలోచిస్తాం.
Familyతో dinner చేస్తున్నప్పటికీ మనస్సులో ఏదో మెయిల్ మెదలాడుతూ ఉంటుంది.
పిల్లలతో బయటికి వెళ్లి ఫోన్‌లో office notifications ఉన్నాయో చూసుకుంటూ ఉంటాం.
వెకేషన్‌కు వెళ్లి “ఒక్కసారి laptop open చేస్తా” అంటాం.
ఒక్కసారి.
ఆ ఒక్కసారి తర్వాత ఇంకోసారి.
మనం ఆఫీసుకు దూరంగా వెళ్లినా కూడా మనలో ఆఫీసు అలానే ఉంటుంది.
శరీరం సెలవులో ఉంటుంది.మనసు మాత్రం మీటింగ్ నడుస్తూ ఉంటుంది.
బహుశా అందుకే మన జీవితంలో ఉద్యోగం కాకుండా ఇతరత్రా కొన్ని విషయాలు కూడా ఉండటం అవసరం.
పెద్ద పెద్ద hobbies అవసరం లేదు.
ప్రతి weekend trekking చేయాల్సిన పని లేదు.
ప్రతి ఉదయం yoga.
ప్రతి సాయంత్రం reading.
ప్రతి నెల ఒక కొత్త skill.
మన leisure timeని కూడా మరో productivity projectగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.
ఒక స్నేహితుడితో అరగంట మాట్లాడటం సరిపోవచ్చు.
ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న వాయిద్యం మళ్లీ పట్టుకోవచ్చు.
పక్కింటి పిల్లలతో క్రికెట్ ఆడొచ్చు.
మనకి ఇష్టమైన పుస్తకం చదువుతూ రెండు గంటలు ఏమీ “achieve” చేయకుండా ఉండొచ్చు.
ఇంట్లో వాళ్లతో కూర్చుని టీ తాగొచ్చు.
లేదంటే ఏమీ చేయకుండా కూర్చోవచ్చు.
అదీ ఒక పనిలాంటిదే.
అదే దాని అందం.
మనకి ఉద్యోగం ఇచ్చే ఐడెంటిటీ ఒక్కటే, కానీ మన పరిధి దానికన్నా చాలా పెద్దది.
మనం
ఒకరికి కొడుకు.
ఒకరికి కూతురు.
ఒకరికి తండ్రి.
ఒకరికి తల్లి.
ఒకరికి స్నేహితుడు.
ఒకరికి పక్కింటి మనిషి.
ఒకరికి మంచి టీ చేసే వ్యక్తి.
ఒకరికి ఎప్పుడూ lateగా వచ్చే స్నేహితుడు.
ఒకరికి cricketలో worst player.
ఒకరికి చాలా మంచి listener.
ఇవన్నీ కూడా మనమే.
కానీ వీటిలో ఏదీ LinkedInలో కనిపించదు.
అందుకే బహుశా మనకి వాటి విలువ తక్కువగా అనిపిస్తుంది.
మనం చేసే పని మనకు జీవితంలో సంపాదనకు మార్గం.
కానీ మన జీవితంలోని చాలా ముఖ్యమైన విషయాలు డబ్బుతో ముడిపడి ఉండవు.
డబ్బు స్నేహాన్ని ఇవ్వదు.
తల్లిదండ్రులతో సమయం గడపడానికి డబ్బుకు సంబంధం లేదు.
పిల్లలతో ఆనందంగా గడపితే వచ్చే ఆనందాన్ని డబ్బు ఇవ్వలేదు.
ఒక hobby డబ్బు ఇవ్వకపోవచ్చు.
పక్కింటి వాళ్లతో పరిచయానికి డబ్బు అవసరం లేదు.
ఉద్యోగం ఉన్నా లేకున్నా ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి.
మనం ఉద్యోగాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు.
ఉద్యోగం మనకి నచ్చకపోతే వెంటనే passion వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు.
చేసే పని మన dream job కావాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు అది మన జీవితాన్ని నడపడానికి మనం చేసే పని మాత్రమే కావచ్చు.
అందులో కూడా ఎలాంటి చిన్నతనం లేదు.
మనకి ఇష్టమైన పని officeలో చేయొచ్చు.
లేదంటే office బయట చేయొచ్చు.
రెండింటిలో ఏదీ ఇంకోదానికంటే గొప్పది కాదు.
ముఖ్యమైన విషయం ఒక్కటే.
మన ఉద్యోగం మన జీవితంలో ఎంత పెద్ద భాగమైనా,
మన జీవితమంతా ఉద్యోగంగా మారిపోకపోవడం.
ఎందుకంటే ఏదో ఒకరోజు ఎవరో మళ్లీ అడుగుతారు —
“మీరు ఏం చేస్తారు?”
అప్పుడు మనం మన జాబ్ టైటిల్ చెబుతాం.
కానీ మన అంతరంగంలో మాత్రం అది మనం చేసే పని మాత్రమే అని గుర్తుండాలి.
అది మనం కాదు, మన అస్తిత్వం కాదు.