Telugu Life

మీరేనా? లేక మీరు ‘మరెవరో’ అయిపోతున్నారా?

bheemkonduru ·

సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక విచిత్రం జరుగుతుంది. ప్రశాంతంగా, మనకంటూ ఒక నేపధ్యం, కొన్ని అభిప్రాయాలతో మన ఫోన్ పట్టుకుని కూర్చుంటాం. కానీ నిమిషాల వ్యవధిలోనే మనలో ఏదో తెలియని మార్పు వస్తుంది. ఉదయం వరకు మనకు అసలు సంబంధమే లేని ఓ విషయం మీద అకస్మాత్తుగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నిన్నటి వరకు మన ఊహల్లో కూడా లేని భయం ఇవాళ మనల్ని కమ్మేస్తుంది. ఎవరో అపరిచితుడి ఆవేశాన్ని మన నెత్తిన వేసుకుని, గుడ్డిగా తలూపుతాం.

ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదంతా మనకు తెలియకుండానే, చాలా సూక్ష్మంగా జరిగిపోతుంది.

ప్రతిస్పందనలే వ్యాపారం

ఈ ప్లాట్‌ఫామ్‌లు మనం ఆగి, నిదానంగా ఆలోచించేలా డిజైన్ చేయబడలేదు. అనంతంగా సాగిపోయే స్క్రోలింగ్, లైక్ బటన్, ట్రెండింగ్ ట్యాబ్‌లు, ఆటోప్లే.. ఇవన్నీ మీ attention  ప్రక్కకుపోకూడదనే ఉద్దేశంతో, పకడ్బందీగా నిర్మించిన ఒక అద్భుతమైన 'ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్' లాంటివి. ఒక క్షణం ఆగి ఆలోచించడం అనేది వాళ్ల వ్యాపారానికి శత్రువు. ఆగి, ఆలోచించి షేర్ చేసే వ్యక్తి.. బహుశా ఆలోచించాక అసలు దాన్ని షేర్ చేయకపోవచ్చు.

రాజకీయ నాయకుల ఆవేశపూరిత ప్రసంగాలైనా, కంటతడి పెట్టించే సంఘటనలైనా, ముప్పై లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆధ్యాత్మిక గురువు మాటలైనా.. అన్నీ ఒకే వేగంతో, ఒకే ప్యాకేజీలో మన ముందుకొస్తాయి. అవన్నీ మన నుంచి ఆశించేది ఒకటే.. తక్షణ ఉద్వేగం! ఇదొక ఉచ్చు అని తెలిసినా సరే.. మన వేళ్లు కామెంట్ చేయడానికి ఉవ్విళ్లూరుతాయి. ఉచ్చులో పడుతున్నామని తెలియడం వేరు.. ఆ ఉచ్చులోంచి బయటపడటం వేరు.

కేవలం చూడకండి.. గమనించండి (Looking vs. Seeing)

ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం దాదాపుగా వాడటం మానేసిన ఒక లక్షణం ఉంది. అదే నిశితంగా గమనించడం (Witness Mind).

ఒక సమాచారం మన కళ్ల ముందుకు రాగానే.. వెంటనే తీర్పు చెప్పకుండా, ఇది మనకు అనుకూలమా, వ్యతిరేకమా అని విభజించకుండా కాసేపు ఆగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే నిజమైన సాక్షిభావం. ఇది బద్ధకం కాదు, నిర్లిప్తత అంతకంటే కాదు. ఒక పోస్ట్ చూడగానే రియాక్ట్ అవ్వడం చాలా తేలిక, కానీ ఆగి గమనించడం అనేది మనం ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన పని. దానికి కాస్త ఓపిక కావాలి.

ఈ ఓపిక అలవడితే.. అసలు ఆ పోస్ట్‌లో ఏం చెబుతున్నారు అన్నదే కాదు, ఎలా చెబుతున్నారు అనేది కూడా మీకు అర్థం కావడం మొదలవుతుంది. ఆ మాటల వెనుక ఉన్న భావోద్వేగాల ఉష్ణోగ్రత తెలుస్తుంది. కవర్‌ చేసిన అర్ధ సత్యాలు స్పష్టమవుతాయి. పైపైన చూడటానికి, లోతుగా గమనించడానికి ఉన్న ప్రధానమైన తేడా ఇదే.

మరింత స్పృహతో ఉండటానికి కొన్ని ఆచరణాత్మక సూచనలు

ఇవేమీ కఠినమైన నియమాలు కావు. మొబైల్ పట్టుకున్నప్పుడు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవడానికి పనికొచ్చే చిన్నపాటి ఉపాయాలు మాత్రమే.

1. మీ మానసిక వాతావరణాన్ని గమనించుకోండి: దేనిమీదైనా స్పందించే ముందు, అసలు మీరు అప్పటికే ఏ భావోద్వేగంలో ఉన్నారో ఒకక్షణం ఆలోచించండి. మీరు అలసిపోయారా? ప్రశాంతంగా ఉన్నారా? లేక దేనిమీదైనా కోపం చూపించడానికి కారణం వెతుకుతున్నారా? భయంతో ఉన్న మనసు.. ప్రతి పోస్ట్‌లోనూ భయాన్నే వెతుక్కుంటుంది. కోపంతో ఉన్న బుర్ర.. ప్రతి విషయంలోనూ అన్యాయాన్నే చూస్తుంది. ముందు మీరెలా ఉన్నారో చూసుకోండి.

2. నా ఆవేశం వల్ల ఎవరికి లాభం?: ప్రతి వైరల్ పోస్ట్ వెనుకా మిమ్మల్ని ఏదో ఒక వైపు నెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు లేదా కేవలం ప్లాట్‌ఫామ్ ఆల్గారిథమ్ కావచ్చు. "నేను దీన్ని షేర్ చేయడం వల్ల ఎవరికి లాభం?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది భయం కాదు, ప్రాథమిక స్పృహ.

3. సమాచారం వేరు, వాతావరణం వేరు: సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేదంతా కచ్చితమైన సమాచారం కాదు. అదొక 'మూడ్' లేదా వాతావరణం. వార్తలు కథలుగా మారిపోతాయి. "అసలు నిజాలేంటి? నాకు తెలియనివి ఇంకా ఏమున్నాయి? అవతలి వాదన ఏంటి?" అని ప్రతిసారీ ప్రశ్నించుకోవాలి.

4. తెలియదనే నిజాన్ని భరించడం (The Discomfort of Not Knowing): బహుశా ఇదే అత్యంత కష్టమైన పని. ఏదైనా విషయం చూడగానే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయాలని మనసు ఆరాటపడుతుంది. అందరూ ఒకే మాట మీద ఉన్నప్పుడు మనం కూడా ఆ గుంపులో చేరిపోవాలనిపిస్తుంది. కానీ, తెలియని విషయాన్ని తెలియనట్లుగా అంగీకరించి, "నాకు దీనిపై ఇంకా స్పష్టత లేదు" అని ఆగిపోవడంలోనే అసలైన అవగాహన మొదలవుతుంది.

5. మీ ఫిల్టర్లను గమనించుకోండి: మన రాజకీయాలు, మనకు నచ్చిన వ్యక్తులు, నచ్చని వారు.. ఇవన్నీ మనం పెరిగిన వాతావరణం, మన సంస్కృతి, మన అనుభవాల నుంచి పుట్టినవే. ఒక విషయాన్ని మనం నిష్పక్షపాతంగా చూస్తున్నాం అనుకుంటాం కానీ, మనకు తెలియకుండానే మన పాత అభిప్రాయాల అద్దాల్లోంచే దాన్ని చూస్తుంటాం. ఆ అద్దాలను ఒకసారి సరిచేసుకుని చూడండి. మీ ఆవేశం మీ ఆలోచన నుంచి వచ్చిందా? లేక మీ పాత అలవాట్ల నుంచి వచ్చిందా? గమనించండి.

6. స్పందించే ముందు కాస్త విరామం ఇవ్వండి: దేన్నీ వెంటనే షేర్ చేయకండి. ఒక పది నిమిషాలు ఆగండి. ఆ తర్వాత ఆ పోస్ట్‌ను మళ్లీ చూడండి. మీలో మొదటిసారి ఉన్న ఆవేశం ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆ పది నిమిషాల విరామం మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

చివరిగా

దీనర్థం సోషల్ మీడియాను పూర్తిగా వదిలేయమని కాదు. ఫోన్ పక్కన పడేసి ఎవరితోనూ మాట్లాడనని సన్యాసం తీసుకోమని అంతకంటే కాదు. అది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే అవుతుంది.

నిరంతరం మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ లోతుల్లోకి వెళ్లాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా సులభమైన, అదే సమయంలో కష్టమైన పని. మన ముందు ఉన్న సమాచారాన్ని చూస్తూనే.. అందులో కొట్టుకుపోకుండా ఉండటం నేర్చుకోవడం.

కంటెంట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. భావోద్వేగాల ప్రవాహం ఆగదు. కానీ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా, ఒడ్డున నిలబడి గమనించే స్పృహ మనలో ఉందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. ప్రతిసారీ ఒక పోస్ట్‌కి వెంటనే రియాక్ట్ అయిపోతున్న క్షణంలో.. మిమ్మల్ని మీరు పట్టుకుని, ఒక చిన్న పాజ్ ఇచ్చి.. "దీన్ని చూస్తున్నది ఎవరు?" అని ప్రశ్నించుకుంటూ ఉంటే మెల్లగా అలవడే నైపుణ్యం ఇది.

సోషల్ మీడియా వాడకం తగ్గించాల్సిన అవసరం లేదు.. వాడేటప్పుడు మనం మరింత 'ప్రెజెంట్'గా (Mindful) ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చిన్న అడుగే.. మనల్ని మనం కోల్పోకుండా కాపాడుతుంది.