Telugu Life

మీ ఆన్‌లైన్ జీవితానికి ఐదు రక్షణ కవచాలు

bheemkonduru ·

రాత్రి పడుకునే ముందు ఏం చేస్తాం? ముందు తలుపు గడియ పెడతాం. వెనక తలుపు చూసుకుంటాం. కిటికీలు మూస్తాం. వీలైతే అడ్డగడియలు పెడతాం. ఒక్కటి మర్చిపోతే చాలు - ఆ ఒక్క సందు చాలు దొంగకి. మన డిజిటల్ భద్రత కూడా అంతే. ఒక్క బలహీనమైన పాస్‌వర్డ్, అజాగ్రత్తగా ఒక్క క్లిక్-ఇవి చాలు కొంప ముంచడానికి. మన ఆన్‌లైన్ జీవితం భద్రంగా ఉండాలంటే, మనకు ఐదు రక్షణ కవచాలు అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం

①

పాస్‌వర్డ్ - తేలిగ్గా తీసుకుంటే సులువుగా దొరికిపోతారు.

"telugu123" లాంటి పాస్‌వర్డ్స్ వాడుతున్నారా? దయచేసి ఇప్పుడే ఆపండి.

పటిష్టమైన పాస్‌వర్డ్ అంటే:

  • కనీసం 12 అక్షరాలు
  • పెద్ద అక్షరాలు + చిన్న అక్షరాలు + సంఖ్యలు + గుర్తులు కలిపి ఉండాలి.

ఇంకా మంచిది- ఓ పాస్‌వర్డ్ మేనేజర్ వాడండి. LastPass, Bitwarden లాంటివి ఉచితంగా దొరుకుతాయి.

చిట్కా: మీకు బాగా గుర్తున్న తెలుగు పదబంధాన్ని పాస్‌వర్డ్ గా మార్చండి. "ManaTeluguTalli@1956" లాంటిది-గుర్తుంటుంది, పటిష్టంగానూ ఉంటుంది.

②

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ - ఒక్క తాళం సరిపోదు

కేవలం పాస్‌వర్డ్ సరిపోదు. ఇంకోస్థాయిలో కూడా భద్రత కావాలి.

2FA అంటే రెండవ ధృవీకరణ-SMS ద్వారా OTP లేదా ఆథెంటికేటర్ యాప్. Gmail, Instagram, నెట్ బ్యాంకింగ్-ఏ ముఖ్యమైన అకౌంట్ లో అయినా ఈ ఫీచర్ ని తప్పనిసరిగా యాక్టివేట్ చేయండి.

ఇంటికి రెండు తాళాలు వేసినట్లు అనుకోండి. ఒకటి పగిలినా, రెండోది కాపాడుతుంది.

③

పబ్లిక్ వైఫై - బహిరంగ ప్రమాదం

కాఫీ షాప్ లో ఫ్రీ వైఫై కి కనెక్ట్ అయ్యి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఆగండి.

అదే నెట్‌వర్క్ లో ఉన్న హ్యాకర్లు మీ డేటా ని చాలా సులభంగా చూడగలరు. రోడ్డు మీద నిలబడి మీ ఏటీఎం పిన్ బిగ్గరగా చెప్పినట్లే ఇది.

పరిష్కారం: VPN వాడండి. NordVPN, ProtonVPN లాంటివి మీ కనెక్షన్ ని ఎన్‌క్రిప్ట్ చేస్తాయి-అంటే మీ డేటా కి అదృశ్య కవచం తొడుగుతాయి.

④

తెలియని లింక్స్ - క్లిక్ చేయకముందు ఆలోచించండి

"అభినందనలు! మీకు ₹10 లక్షలు వచ్చాయి!" - ఇలాంటి మెసేజ్ వచ్చిందా? వెంటనే డిలీట్ చేయండి.

"మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, ఇప్పుడే క్లిక్ చేయండి" - ఇలాంటి ఈమెయిల్ వచ్చిందా? ముందు ఆగి ఆలోచించండి.

ఇవి ఫిషింగ్ అటాక్స్. చూడటానికి నిజంలా ఉంటాయి, కానీ మీ డీటెయిల్స్ దొంగిలించడానికే పంపుతారు.

సూత్రం ఒక్కటే: తెలియని లింక్ అంటే తెరవకూడని లింక్

⑤

అప్‌డేట్స్ - వాయిదా వేస్తే ప్రమాదం

ఫోన్ లో "Update available" అని వస్తే ఇగ్నోర్ చేస్తున్నారా?

ఆ అప్‌డేట్స్ లో సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి-అంటే తెలిసిన లోపాలకు మందు. పాత సాఫ్ట్‌వేర్ అంటే తెరిచిన తలుపు లాంటిది.

ఫోన్ OS, యాప్స్, బ్రౌజర్-అన్నీ అప్‌డేట్ చేస్తూ ఉండండి.

ముగించేముందు ఓ మాట.,

ఈ వారాంతంలో ఒక్క గంట మీ ఆన్‌లైన్‌ భద్రత కోసం కేటాయించండి. మీ పాస్‌వర్డ్స్ చూసుకోండి. 2FA యాక్టివేట్ చేయండి. అనవసరమైన యాప్స్ తొలగించండి.

ఈ చిన్న జాగ్రత్తలు - పెద్ద పెద్ద ఉపద్రవాల నుండి కాపాడతాయి.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు? ముందే జాగ్రత్త పడదాం.