Telugu Life

మాతృభాష మేధస్సుకు మూలం..

bheemkonduru ·

పరిచయం

ఈ ప్రసంగం 2026 ఆరంభంలో జరిగిన 'లిపి ఎపిక్స్ రామాయణ్ యాప్' (Lipi Epics Ramayan App) లాంచ్ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, లోక్‌సత్తా వ్యవస్థాపకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ (JP), ఎల్.వి. సుబ్రహ్మణ్యం, వి.ఎస్.ఆర్. మూర్తి మరియు యాప్ రూపకర్త సాగర్ అనిసింగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాతృభాషలో విద్యాభ్యాసం ప్రాముఖ్యతను, పిల్లల మానసిక వికాసానికి అది ఎలా తోడ్పడుతుందో వాస్తవికంగా వివరించారు. కేవలం ఇంగ్లీష్ మీడియం మోజులో పడి మాతృభాషను, భారతీయ సంస్కృతిని, మూలాలను ఎలా విస్మరిస్తున్నామో తెలుపుతూ — సాంకేతికతను, భాషను, సంస్కృతిని మేళవించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా సాగర్ బృందం రూపొందించిన 'లిపి' యాప్ ఆవశ్యకతను ఆయన ఈ ప్రసంగంలో ఆవిష్కరించారు.

ప్రసంగం

అందరికీ నమస్కారం. ఇందరు విజ్ఞుల మధ్య, పండితుల మధ్య కూర్చుంటే.. నాకు కొంచెం భయంగా, సందేహంగా అనిపిస్తుంది. ఓ కథ గుర్తుకొస్తుంది. 2500 సంవత్సరాల క్రితం సోక్రటీస్ బ్రతికున్న రోజుల్లో, ఆయన శిష్యులతో సంవాదం చేసేవాడు. ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు కాదు, పాఠాలు చెప్పేవాడు కాదు. కేవలం చర్చల ద్వారా జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవాడు. ఓ 20 ఏళ్ల పాటు ఆయన, ఇతర శిష్యుల మాటలు విన్నటువంటి ఒక శిష్యుడు లేచి.. "అయ్యా, 20 ఏళ్ల పాటు నేను చాలా జాగ్రత్తగా మీ అందరి చర్చలు, మాటలు వింటూ ఉన్నాను. ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. అలా నోరు తెరవకుండా ఉంటే మంచిదా, చెడ్డదా?" అని అడిగాడట.

అనితర సాధ్యమైన శైలిలో ఆ మహా తత్వవేత్త సమాధానం చెప్పాడట. సర్వకాలీనమైన సమాధానం, సార్వజనీయమైన సమాధానం.. "ఇఫ్ యు ఆర్ ఏ వైజ్ మ్యాన్.. యు ఆర్ ఏ ఫూల్. ఇఫ్ యు ఆర్ ఏ ఫూల్.. యు ఆర్ ఏ వైజ్ మ్యాన్" అన్నాడట! అందరికీ అర్థం కావడం కోసం కొంచెం టైం పట్టిందట. "నీవు విజ్ఞుడవైనట్లయితే, నీ పలుకుల వల్ల పది మందికి ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉన్నట్లయితే.. నీ విజ్ఞతను నీలో దాచుకున్నందుకు నువ్వు ఒక మూర్ఖుడివి. నువ్వు స్వతహాగా మూర్ఖుడవైనట్లయితే, నీ మాటల వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేకపోయినట్లయితే.. నీ మూర్ఖత్వాన్ని నీలో దాచుకున్నటువంటి విజ్ఞుడివి నువ్వు" అన్నట్టు. ఇప్పుడు నా సమస్య ఏంటంటే.. మూర్ఖత్వాన్ని నాలో దాచుకోవాలి. అందుకని క్లుప్తంగా ముగిస్తాను. మరి మీరు అడగొచ్చు.. "ఎందుకు వచ్చావయ్యా? అంత మూర్ఖత్వం ఏంటి?" అని. మూడు కారణాలతో ఇక్కడికి వచ్చాను.

మొట్టమొదటిది.. భాష: మన సమాజంలో, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు.. రకరకాల విభజనలు ఉన్నాయి. కులం, మతం, భాష, ప్రాంతం, పార్టీ, వర్గం.. రకరకాలుగా. వీటిలో సహజమైన విభజన.. భాష. ఎందుకంటే మనిషికి, మానవ సమాజానికి మధ్య బొడ్డుతాడు భాష. భాషను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదు. మొన్న సాగర్ గారు, వారి బృందం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం.. 'తెలుగు తెలియకపోవడం చాలా గొప్ప' అనుకునే మూర్ఖత్వం ప్రబలుతున్న సమాజంలో మనం ఉన్నాం. తెలుగు తెలియకపోతే ఆంగ్లం బాగా వస్తుందని భ్రమలో ఉన్నాం మనం. ఒక భాష మీద పట్టు లేకుండా మరో భాష రాదు. భాష కేవలం మాట్లాడడం కోసం కాదు, ప్రాస కోసం కాదు, అందం కోసం కాదు, అలంకారం కోసం కాదు.. భావ ప్రకటన కోసం! అంతేకాదు, భాష మీద పట్టు లేకపోతే మేధస్సు మీద పట్టు లేదు. ప్రపంచంలో అపారమైన మేధస్సు ఉండి, సమాజాన్ని అశేషంగా ప్రభావితం చేసిన మహనీయులందరూ (శాస్త్రవేత్తలు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు) ఏ రంగంలో అయినా సరే.. భాష మీద పట్టు లేకుండా ప్రభావం చూపెట్టిన వాళ్లు ఎవరూ లేరు.

ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. కానీ, ఏ భాష వాళ్లకు కూడా తమ భాష పట్ల ఇంత చులకన భావం ఉండదు.. ఒక్క తెలుగు వాళ్లకు ఉన్నంత! ప్రభుత్వంలో కూడా ఎల్వీని అడగండి.. తెలుగులో రాస్తే చాలా నామోషీ, తెలుగులో సంతకం పెడితే చాలా నామోషీ! మన ప్రజలకు అర్థం కాని భాషలో, మనకి తెలియని భాషలో మనం వాగి, వాళ్లని చావగొట్టడం. ఈ మధ్య ఒక హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో కొంత భాగాన్ని పత్రికల్లో వేశారు. రెండు మూడు వాక్యాలు వేశారు. ఒక్క వాక్యం కూడా మెదడున్న తలకాయోడికి అర్థం కాదు. ఆయన హైకోర్టు న్యాయమూర్తి.. తెలియని భాషలో ఆయన తీర్పు! 'ఇంగ్లీష్ మీడియం' అంటున్నాం. నా మట్టుకు నేను నిజాయితీగా చెప్తున్నాను కదా.. 40 ఏళ్లుగా నేను చదివింది, రాసింది, ఆలోచించింది అత్యధికంగా ఇంగ్లీష్‌లోనే. ఆలోచించేది ఇంగ్లీష్‌లో, అనుక్షణం నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగులోకి అనువదిస్తుంటాను. తెలుగులో కూడా రాస్తాను కానీ, అనువదించి రాస్తుంటాను. ఇంగ్లీష్ వద్దని నేను అనట్లేదు. కానీ, 'ఇంగ్లీష్ మీడియం' అన్న పేరుతో.. ఇంగ్లీష్ రాని పిల్లలకి, ఇంగ్లీష్ రాని పంతులు ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇంగ్లీష్ రాక, తెలుగు రాక, విషయం బోధ పడక.. పనికి రాని వాళ్లని తయారు చేస్తున్నాం సమాజంలో.

ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ను నేను ప్రేమిస్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లంతా ప్రేమిస్తున్నాం, దాన్ని వద్దని ఎవరంటారు ఇవాళ సమాజంలో? కానీ, పిల్లలకి ఏ భాషలో అర్థమవుతుందో, చుట్టూ ఉన్న సమాజంతో ఏ భాషలో సంపర్కం ఉందో.. ఆ భాషలో మనం పాఠాలు చెప్పకుండా, తొలి కొద్ది సంవత్సరాల్లో ఆ పిల్లవాడి మేధస్సు వికసిస్తుంది అనుకుంటే మన మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు. ఇవాళ మన దేశంలో ఉన్నంత పరమ దారుణంగా పాఠశాల విద్య, ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో మాత్రమే ఉంది. ఏ పెద్ద దేశంలోనూ ఇంత దారుణమైన విద్య లేదు. ఇది ఒక్కటే కారణం కాదు గానీ, భాష ఒక కీలకమైన కారణం. అర్థం కాని విషయాలు, అర్థం కాని భాషలో, అర్థం కాకుండా చెప్పి.. చెప్పినట్టు నటించి, బట్టీ పడితే, కాపీ కొడితే చాలనే పరిస్థితి కల్పించి బతుకుల్ని నాశనం చేస్తున్నాం. ఈ సమాజ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాలి. అటు సాంకేతిక విజ్ఞానాన్ని, ఇటు ఆహ్లాదాన్ని భాషతో కలపాలి. ఆ ప్రయత్నాన్నే ఇవాళ సాగర్ గారు, వారి బృందం చేశారు, చేస్తున్నారు. అందుకోసమే నేను వచ్చాను, ఇది మొట్టమొదటిది.

రెండవది.. సంస్కృతి: ఒక అసాధారణమైన సంస్కృతి మనది. ప్రతి సంస్కృతిలో, సాంప్రదాయంలో చాలా గొప్పతనం ఉంటుంది, కొంత మూర్ఖత్వం ఉంటుంది. సంప్రదాయం పేరుతో కులం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది, కులం పేరుతో వివక్ష ఉన్నది.. దాన్ని తిరస్కరిద్దాం. సంప్రదాయం పేరుతో మూఢ నమ్మకాలు ఉన్నాయి.. దాన్ని అణచివేద్దాం. సంప్రదాయం పేరుతో లింగ వివక్ష ఉన్నది.. దాన్ని తిరస్కరిద్దాం. కానీ, 'సాంప్రదాయాన్ని తిరస్కరించాం' అనేవాడు మూర్ఖుడు. ఆ పునాదులు లేకుండా బతకాలనుకునేవాడు గాలిలో దీపం పెట్టేవాడు. ఎవరో ఒక పెద్దాయన, ఒక విజ్ఞుడు చెప్పారు చాలా ఏళ్ల క్రితం. ఆయన ఇండోనేషియా వెళ్లినప్పుడు ఎక్కడ చూసినా కూడా రామాయణము, అయోధ్య.. ఆ పేర్లు గాని, లేకపోతే సంస్కృతి గాని కనిపించింది. ఆయన ఆశ్చర్యపోయి, "గనుక మీది ఇస్లాం మతం కదా, ఈ గొడవ అంతా ఏంటి?" అని అడిగాడట. దానికి ఆయన చాలా గర్వంగా చెప్పాడట ఇండోనేషియన్ నాయకుడు.. "ఇస్లాం ఇస్ అవర్ రిలీజియన్ అండ్ అవర్ ఫెయిత్. రామాయణ ఇస్ అవర్ కల్చర్" అని. ఆ విషయం మర్చిపోయాం మనం ఈ దేశంలో! అదేదో నామోషీ అన్నట్టుగా సంస్కృతి మూలాలని మర్చిపోతున్నాం.

ప్రపంచానికి ఈవేళ శూన్యాన్ని (సున్నాన్ని) ఇచ్చింది ఏంటి అంటే, దశాంశ నిర్మాణం చేసింది ఏంటి అంటే ఈ జాతే! ఓ ఆర్యభట్టుడు, ఓ బ్రహ్మగుప్తుడు.. వాళ్ల నుంచి ఈ అంకెలు ఇక్కడి నుంచే వెళ్లాయి. ఓ భారతీయుడు (ఒక బౌద్ధాన్ని స్వీకరించినవాడు) అబ్బాసిద్ కాలిఫేట్‌లో (Abbasid Caliphate) ఉన్నత స్థానానికి వెళ్దాం అని చెప్పి, అక్కడికి వెళుతూ బ్రహ్మగుప్తుని గ్రంథాన్ని తీసుకెళ్లాడు. అక్కడ దాన్ని అనువదించారు. 'అల్-ఖ్వారిజ్మీ' అని చెప్పే ఒక పర్షియన్ అనువాదంలో చాలా పొడుగాటి శీర్షిక ఉన్నది ఆ పుస్తకానికి. దానిలో 'అల్-జబర్' అని మధ్యలో ఉంటుంది. అంత పొడుగు పలకలేక ఆ పుస్తకాన్ని 'అల్-జబర్' అంటారు అరబిక్‌లో. యథాతథంగా బ్రహ్మగుప్తుని పుస్తకాన్ని అనువదించాడు. అక్కడి నుంచి 12వ శతాబ్దంలో ఫిబొనాచీ ఇతరుల ద్వారా ఇటలీకి పోయింది. అక్కడి నుంచి లియోనార్డో డావిన్సీ అందుకున్నాడు. అక్కడి నుంచి యూరోప్‌కి వెళ్ళింది. అది లేకపోతే ఆధునిక గణితం లేదు! ఆల్-జబర్ అన్న పేరు నుంచి 'ఆల్జీబ్రా' వచ్చింది, అల్-ఖ్వారిజ్మీ అన్న పేరు నుంచి 'అల్గారిథమ్' వచ్చింది. మూలం ఈ సమాజం నుంచి, ఈ గడ్డ నుంచి వచ్చింది. మన సంస్కృతిలో పొరపాట్లను సవరిద్దాం, కానీ దానిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించకుండా మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఉండి మన మూలాలను కోల్పోతే.. నష్టపోయేది ఈ సమాజం, మన భవిష్యత్తు. కాబట్టి సంస్కృతిని గౌరవించాలి, దానిలో ఉన్న గొప్పతనాన్ని పెంచాలి, దానిలో ఉన్న మూర్ఖత్వాన్ని నిరసించాలి.

మూడోది.. తార్కిక చింతన: 'మరేమండీ రామాయణం, మహాభారతం ఈ సంస్కృతి అంతా దేవుడు, దైవత్వానికి సంబంధించినది. దేవుడికి సంస్కృతికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు' (అనొచ్చు). నా మట్టుకు నేను సంశయవాదిని (Agnostic). నాకు తెలియదు దేవుడు ఉన్నాడో లేదో! చిన్ననాడు మా తల్లిదండ్రులతో పాటు నేను కూడా పూజలు చేసేవాడిని, గణేష్ చవితి నాడు వినాయకుడి కథ చదివేవాడిని. ఎప్పుడో 13 ఏళ్ల వయసులో బెర్ట్రాండ్ రస్సెల్ (Bertrand Russell) చదవడం మొదలుపెట్టిన తర్వాత, దేవుడికి నాకు పెద్దగా సంబంధం లేదని అనిపించింది. నేను ఎప్పుడూ చెప్తుంటాను.. నాకు దేవుడికి ఉన్న సంబంధం 'మ్యూచువల్ నాన్-ఇంటర్ఫియరెన్స్' (పరస్పర జోక్యం చేసుకోకపోవడం). దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే, నేను కూడా దేవుని గురించి పట్టించుకోను, ఆయన సంగతి ఆయన చూసుకోనివ్వండి! కానీ, దేవుడు ఉండక్కర్లే.. మన సాంప్రదాయంలో అతి గొప్ప వాక్యం నాకు నచ్చింది ఏమిటంటే, ఋగ్వేదంలో "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" (సత్యం ఒక్కటే, విజ్ఞులు బహురూపాల్లో సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు, దారులు వెతుక్కుంటారు). ప్రపంచ తార్కిక చింతనలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతటి లోతైనటువంటి అవగాహనతో, 'ఎక్కడ సత్యం ఉన్నా వెతికి పట్టుకుంటాం, సత్యం కోసం దారిని వెతుక్కుంటాం' అని చెప్పిన వాళ్లు లేరు. అందుకే ఈ దేశం.. 2000 సంవత్సరాల క్రితం యూదులు ఈ దేశానికి వస్తే, అప్పటినుంచి ఇప్పటిదాకా శాంతియుతంగా వాళ్ల సంప్రదాయాన్ని నడపగలుగుతున్నారు. జీసస్ క్రైస్ట్ సిలువ ఎక్కిన కొద్ది కాలానికే సెయింట్ థామస్ ఈ దేశానికి వస్తే, అప్పటినుంచి ఇప్పటిదాకా క్రైస్తవులు శాంతియుతంగా తమ మతాన్ని, తమ విశ్వాసాలని అమలు చేసుకోగలుగుతున్నారు ఆటంకం లేకుండా. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్లిన తర్వాత, కేవలం ఒకటి రెండు దశాబ్దాలకే అరబ్బులు ఇక్కడికి వస్తే.. అప్పటినుంచి ఇప్పటిదాకా ఇస్లాం ఈ దేశంలో ఏ రకమైన అడ్డంకి లేకుండా, లొంగిపోకుండా కొనసాగుతోంది. అందరికీ అవకాశం ఇచ్చినటువంటి జాతి అది, అన్నిటిని ఇముడ్చుకున్న జాతి అది!

చాలామంది మన సాంప్రదాయంలోకి వెళ్తే, మన రామాయణ మహాభారతాలు పిల్లలకు చెప్తే.. 'ఏదో మన మతాన్ని చెప్తున్నాం, మరోటి చెప్తున్నాం' అన్నటువంటి పొరపాటు భావంతో ఉన్నారు. ఇందాక వారు చెప్తున్నారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని గురించి. ఇదే గడ్డ మీద, తెలుగు గడ్డ మీద 'రామాయణ విషవృక్షం' అని చెప్పి ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు రాశారు. ఎవరూ ఆయుధాలు పట్టి ఆవిడ్ని కొట్టలేదు! ఇప్పటికీ ఆవిడ సజీవంగా ఉన్నారు, ఈ మధ్యే ఫోన్లో మాట్లాడాను. వారి భావం వారిది, వారిని అనుసరించే వాళ్లు ఉంటే అనుసరించొచ్చు అభ్యంతరం లేదు. ఎంత ధీమా కావాలి ఆ భావానికి? ఎలాంటి భావాన్ని అయినా సరే, ఎలాంటి విమర్శనైనా విమర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక దూరదృష్టి ఉన్న, అందరినీ సమ్మిళితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి సమాజం మనది. కాబట్టి, మనం నమ్మిన దేవుడితోనో, నమ్మిన సిద్ధాంతాలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు.

ముగింపు: ఈ మూడు అంశాలు ఈవేళ సమాజంలో అందరికీ అర్థం కావాలి. ఇందాక దేశం గురించి మాట్లాడారు వి.ఎస్.ఆర్. మూర్తి గారు. ఒక జాతి అంటూ ఉన్నది, 145 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడో దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రార్థన గీతంలో అన్నాడు ఆయన, "ఈ దేశం ఆనాడు 40 కోట్లే.. 40 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులు ఉన్న దేశం ఈ దేశం. గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం ఈ దేశం. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆత్మస్థైర్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకున్న నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం ఈ దేశం" అని. ఆ ప్రజలు ఉన్నారు. వాళ్లకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉన్నది. మానవ ఇతిహాసంలో తొలిసారిగా అందరి అవకాశాలని పెంచి, పేదరికాన్ని తొలగించి, వాళ్ల శక్తి సామర్థ్యాలను వికసింపచేసి, నివారించదగ్గ క్లేశాన్ని నిర్మూలించే అవకాశం ఈవేళ ఈ శతాబ్దంలో మనకు ఉన్నది. అందుకు భాషని, సంస్కృతిని, తర్కాన్ని ఆయుధంగా వాడతామని ఆశిస్తూ.. దాన్ని ఈ దేశంలో ఉన్న పిల్లలకి, తెలుగునాట ఉన్న పిల్లలందరికీ కూడా సులభంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సాగర్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను.

ఒక్కటే కోరిక.. అభినందించడంతో పాటు పోషించండి! ఓ సినిమాకి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం (సినిమాకి వెళ్లొద్దని నేను అనట్లే.. మా శ్రీమతి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, 'చెత్త సినిమాలు కూడా ఎందుకు చూస్తావు?' అని. పాపం కష్టపడి తీశారు కదండీ, చూడకపోతే ఎట్లా అని! సినిమా చూడండి, వద్దనట్లే). ఒక సినిమాకి 500 ఖర్చు పెట్టేది.. ఓ సంవత్సర కాలం భాష నేర్చుకోవడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? అంత కష్టంగా ఉన్నామా మనం? ఒకరోజు రెస్టారెంట్‌కి పోయి ఒక బ్రేక్ ఫాస్ట్ చేస్తే 500 రూపాయలు అయ్యేది.. మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం, పిల్లలకి ఆ పునాదులు ఇవ్వడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? పోషించాలి! మాటలు చాలు. ముఖ్యంగా ఆ మాట చెప్పడం కోసమే నేను వచ్చాను. దీన్ని తెలుగు ప్రజలు ఆదరిస్తారని, అన్ని భాషలకు విస్తరించినప్పుడు ఈ దేశ ప్రజలు ఆదరిస్తారని, లబ్ధిని పొందుతారని మనసారా ఆశిస్తూ.. మరోసారి ఈ మంచి ప్రయత్నానికి గుండెల్లోంచి అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.

జై హింద్!