గెలుపు గడప దాటాక...
bheemkonduru ·

ఉద్యోగం సాధించిన క్షణం, కొత్త ఇంటి తాళాలు అందుకున్న వేళ, ఎన్నాళ్ల నుంచో కలగన్న మనిషి జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భం... ఇవన్నీ ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. మనం చదివే నవలల్లో, చూసే సినిమాల్లో కథలు అక్కడితో సమాప్తం అవుతాయి. కానీ నిజానికి, అసలు జీవితం మొదలయ్యేది ఆ వేడుక ముగిసిన తర్వాతే.
మనం తరచుగా విజయాన్ని ఒక ముగింపుగా చూస్తాం. కానీ చాలాసార్లు సాధించడం అనేది కేవలం 'ఎంట్రీ గేట్' మాత్రమే. అసలైన ప్రయాణం ఆ తర్వాతే మొదలవుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో మూడు ముఖ్యమైన దశలు ఉన్నాయి.
సాధించడానికి పట్టుదల కావాలి.
ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకు చాలా పట్టుదల ఉంటుంది. మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు రాత్రింబవళ్లు శ్రమిస్తాం, ఒక్క రిప్లై రాకపోయినా వందల అప్లికేషన్లు పంపుతాం. ఎందుకంటే మన ముందొక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. మనిషికి సహజ సిద్ధంగా ఉండే ఇతరత్రా ఆకర్షణలు, ఈ లక్ష్యం సాధించే క్రమంలో పక్కకు తప్పుకుంటాయి. మనిషి తన default state ను వదిలి, తన comfort zone ను వదిలి ముందుకు వెళ్తాడు. మనలో మనకు తెలియకుండానే ఒక డైనమిజం వస్తుంది. అనుకున్నది సాధిస్తాం.
నిలబెట్టుకోవడానికి స్థిరత్వం కావాలి.
కొత్త జాబ్, కొత్త అలవాటు, కొత్త రిలేషన్‌షిప్... ప్రారంభంలో అంతా ఉత్సాహంగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రోజూవారీ జీవితం మనల్ని వెనక్కు లాగుతుంది. మన లక్ష్యసాధనలో ఉన్న ఉత్సాహం, ప్రోత్సాహం క్రమంగా తగ్గుముఖం పడతాయి. మన ఉద్యోగ జీవితం లేదా మన వైవాహిక జీవితం ఎలా ఉందని ఎవరు ఆరాలు తీయరు. జీవితంలో మొనాటనీ ఎంటర్ అవుతుంది. సరిగ్గా అక్కడే 'స్థిరత్వం' (Consistency) అవసరం అవుతుంది. జీవితంలో ఏదీ ఒక "event" తో అయిపోదు. జీవితం నిత్య ప్రవాహం. మన ఉద్యోగం సరిగా చేస్తున్నందుకు, ఒక బాధ్యతతో కూడిన భాగస్వామిగా ఉన్నందుకు, మనల్ని ఎవరూ ప్రతిరోజూ ప్రశంసించరు. ఇక్కడే మనకు కాస్త వ్యక్తిగతమైన ప్రేరణ అవసరం. జీవితంలో ప్రతిరోజూ ఒకేలా ఉన్నంత మాత్రాన, ప్రతి సారీ మనల్ని గుర్తించి గౌరవించే వాళ్ళు లేనంత మాత్రాన, జీవితంలో మనం సాధించిన దానికి విలువ లేదని కాదు. ఇదో ప్రయాణం అన్న విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మనం సాధించిన దానిని నిలబెట్టుకోవడానికి నిరంతమైన ప్రయత్నం ఉండాలి. లేకపోతే మనం మళ్ళీ క్రిందకి జారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పెంపొందించుకోవడానికి కృతజ్ఞత కావాలి.
ఒక బంధమో, నైపుణ్యమో మన దగ్గర పదేళ్లు ఉండటం వేరు, ఆ పదేళ్లలో అది మరింత పరిణతి చెందడం వేరు. ఉండటం మాత్రమే సరిపోదు, అది పెరగాలి. అక్కడే కృతజ్ఞత అవసరం అవుతుంది. మనకున్న దానికి తగిన విలువ ఇవ్వడమే నిజమైన కృతజ్ఞత. మంచి మిత్రుడు ఉన్నప్పుడు "ఎప్పుడూ ఉంటాడులే" అని నిర్లక్ష్యం చేయకుండా పలకరించడం, ఉన్న నైపుణ్యానికి మరింత పదును పెట్టడం ఇందులో భాగమే. మనం దేనికైతే శ్రద్ధ ఇస్తామో, అక్కడ ఎదుగుదల మొదలవుతుంది.
జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల కావాలి. మనం సాధించింది మన దగ్గర నిలబడటానికి స్థిరమైన ప్రయత్నం కావాలి. అది మరింత ఫలవంతంగా మారడానికి దాని విలువ తెలిసి నడచుకోవడం కావాలి. మనకు దక్కిన అవకాశాలు, ఆరోగ్యం, అనుబంధాలు ఏవీ షోకేస్‌లో పెట్టుకునే వస్తువులు కావు; అవి ప్రాణమున్న మొక్కలు లాంటివి. వాటికి శ్రద్ధ, సమయం రెండూ అవసరం.
మంచి అవకాశాలు రావడం అదృష్టమే కావచ్చు, కానీ అవి మనతో కలకాలం నిలిచి మనం మరింతగా ఎదగడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
సాధించడం ఒక అడుగైతే, దానిని నిలబెట్టుకుంటూ ఇంకా ఇంకా ఎదగడం అసలైన గెలుపు.