అమ్మలందరికీ...ఓ చిన్న విన్నపం.
telugulife ·

మీ చేతుల్లో ఒక అద్భుతమైన నేర్పు ఉంది.
అది ఎక్కడో చదివి నేర్చుకున్న విద్య కాదు. ఏళ్ల తరబడి ఒక ఇంటిని నడుపుతూ, కుటుంబం కోసం మీ సమయాన్నీ శక్తినీ వెచ్చిస్తూ, తప్పులు చేస్తూ, వాటిని సరిదిద్దుకుంటూ మీరు చేసిన సాధన అది.
అందుకే ఇప్పుడు ఇంట్లో చాలా విషయాలు మీకు అసలు “పనులు”లాగే అనిపించవు.
ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలో కొలవాల్సిన అవసరం లేదు. ఏ గిన్నె ఎక్కడుందో వెతకాల్సిన పని లేదు. ఏ పని ముందు చేస్తే తర్వాతది సులభమవుతుందో ఆలోచించాల్సిన పనే లేదు.
చేతులు వాటంతట అవే చేసేస్తాయి.
ఇరవై, ముప్పై ఏళ్ల అనుభవం కదా.
కానీ చిత్రంగా, ఈ నేర్పు దగ్గరే ఒక చిన్న సమస్య కూడా మొదలవుతుంది.
మీకు ఎంతో సులభంగా కనిపించే పని ఇంకొకరు చేస్తుంటే… చూస్తూ ఉండటం కష్టమైపోతుంది.
ఎవరైనా కూరగాయలు కోస్తుంటే, “అలా కాదు, ఇలా కోస్తే త్వరగా అవుతుంది” అని చెప్పాలనిపిస్తుంది.
వంట చేస్తుంటే, “ఇప్పుడు అది వేయకూడదు” అని దగ్గరకు వెళ్తారు.
గిన్నెలు సర్దుతుంటే, “అది అక్కడ కాదు” అని చేయి ముందుకు వెళ్తుంది.
ఏదైనా శుభ్రం చేస్తుంటే, వాళ్లు పూర్తి చేయకముందే మిగిలిపోయిన చిన్న మూల మీ కంటికి స్పష్టంగా కనిపిస్తుంది.
మొదట చూస్తారు.
కొద్దిసేపు ఓర్చుకుంటారు.
ఆ తర్వాత ఇక ఆగలేక -
“ఇటు ఇవ్వు… నేను చేస్తానులే” అంటారు.
మీ ఉద్దేశంలో తప్పేమీ లేదు. పని త్వరగా అయిపోతుంది. తప్పు జరగదు. వాళ్లకు శ్రమ తగ్గుతుంది. పైగా మీరు రెండు నిమిషాల్లో చేయగలిగిన పనిని వాళ్లు పది నిమిషాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నిజంగానే కష్టం.
కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది.
మీరు రోజు రెండు నిమిషాల్లో చేస్తున్నారంటే దాని వెనుక ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఈ విషయాన్ని మనం మర్చిపోతాం.
మీ చేతులు కూడా ఒకప్పుడు ఇంత వేగంగా కదలలేదు.
మీ కొలతలూ తప్పాయి. మీ వంటలూ ఒక్కోసారి చెడిపోయాయి. మీరూ పనులు మర్చిపోయారు. ఏది ఎక్కడ పెట్టాలో మీరూ అనుభవంతోనే నేర్చుకున్నారు. కొన్ని విషయాలు ఎవరో చెప్పారు; మరికొన్ని ఎవరూ చెప్పలేదు - మీరే చేసి, తప్పి, మళ్లీ చేసి తెలుసుకున్నారు.
ఈరోజు మీకు ఇంత సహజంగా వచ్చిన నేర్పు వెనుక అలాంటి వందల చిన్న తప్పులున్నాయి.
కానీ అదే పని మేము చేస్తుంటే, ఆ తప్పు వరకు వెళ్లకముందే మీరు మధ్యలోకి వచ్చేస్తారు.
“అలా కాదు.”
“అది అక్కడ పెట్టకు.”
“నీకు తెలియదు, నేను చేస్తాను.”
పని మాత్రం చక్కగా అయిపోతుంది.
మాకు మాత్రం నేర్చుకునే అవకాశం మరోసారి వాయిదా పడుతుంది.
ఇది ఒక్క వంటింటి విషయమే కాదు.
ఇంట్లో ఏ వస్తువు కొనాలి, ఎక్కడ పెట్టాలి, అతిథులు వస్తే ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పండగ ఎలా జరపాలి - ఏళ్లుగా ఒక ఇంటిని నడిపిన మనిషికి వీటన్నింటికీ తనదైన పద్ధతి ఏర్పడటం సహజం.
సమస్య పద్ధతి ఏర్పడటంలో లేదు.
“నేను ఇలా చేస్తాను” అనేది నెమ్మదిగా “ఇలాగే చేయాలి”గా మారిపోవడంలో ఉంది.
రెండింటి మధ్య తేడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ అదే తేడా ఇంట్లో మిగతావాళ్లకు ఎంత తావుందో నిర్ణయిస్తుంది.
ఎవరైనా మీకంటే నెమ్మదిగా చేయవచ్చు.
మీరు పెట్టే చోట కాకుండా మరోచోట పెట్టవచ్చు.
మీ పద్ధతిని కాస్త మార్చేయవచ్చు.
మీకు అసలు నచ్చని దారిలో వెళ్లి, చివరికి మీరు కోరుకున్న ఫలితాన్నే తీసుకురావచ్చు.
ఒక్కోసారి చెడగొట్టవచ్చు కూడా.
పర్లేదు.
ఒక కూర చెడిపోతే మరో కూర చేసుకోవచ్చు. ఒక గిన్నె తప్పు అరలో పెడితే మళ్లీ సర్దుకోవచ్చు. పది నిమిషాలు ఎక్కువైతే ఆ రోజు పనులు కొంచెం ఆలస్యమవుతాయి, అంతే. పెద్ద నష్టమేమీ జరగదు.
కానీ ప్రతి పనిలోనూ ఎవరో ఒకరు వచ్చి సరిచేస్తుంటే, ఒక దశ దాటాక మనుషులు ప్రయత్నించడమే మానేస్తారు.
ఆ తర్వాత ఇంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి వస్తుంది:
అన్నీ అమ్మకే తెలుసు.
అన్నీ అమ్మే చేస్తుంది.
అమ్మ లేకపోతే ఎవరికీ ఏదీ చేతకాదు.
చివరికి అదే అమ్మకు అలసటతో కోపం వస్తుంది -
“ఈ ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలా?”
ఆ మాటలో అలసట ఉంటుంది, ఆవేదన ఉంటుంది.
కానీ దాని వెనుక ఇంకో కనిపించని ప్రశ్న ఉంటుంది:
“మిగతావాళ్లను అసలు చేయనిచ్చామా?”
అమ్మలూ, మీ అనుభవం మాకు ఎప్పుడూ అవసరమే.
కానీ ప్రతిసారీ మీ చేతులే ముందుకు రావాల్సిన పనిలేదు.
కొన్నిసార్లు మేము తడబడుతుంటే వెంటనే పని లాక్కోకుండా కాసేపు మౌనంగా చూడండి. అడిగితే చెప్పండి. అవసరమైతే చూపించండి. తప్పు పెద్ద నష్టం చేయబోతుంటే ఆపండి.
మిగతా చిన్న చిన్న తప్పులను మాత్రం మాకే వదిలేయండి.
ఎందుకంటే, ఒకప్పుడు అవే చిన్న తప్పులు కదా మిమ్మల్ని ఇంత సమర్థురాలిగా తీర్చిదిద్దింది!
మీరు రెండు నిమిషాల్లో చేసే పనికి మేము పది నిమిషాలు తీసుకుంటే -
ఆ అదనపు ఎనిమిది నిమిషాలు వృథా కావు.
అవి మేము నేర్చుకునే జీవన పాఠాలు.