ఇల్లు ప్రశాంతంగా ఉండాలా? జపనీస్ ‘మినిమలిజం’ సూత్రాలివే!
bheemkonduru ·

ఇల్లు చూడగానే గందరగోళంగా కాకుండా మనసుకు ఆహ్లాదకరంగా అనిపించాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం మినిమలిజం. జపనీయుల జీవనవిధానంగా భావించే ఈ విధానంలో అనవసర వస్తువులను తగ్గించి, ఇంటికి కొత్త కళను తీసుకురావడానికి కొన్ని సూత్రాలు చెప్పబడ్డాయి. సాధారణంగా మినిమలిజం అంటే ఇల్లు ఖాళీగా ఉంచడం అనుకుంటాం; కానీ నిజానికి అవసరమైన వాటికి మాత్రమే స్థానం కల్పించడం అసలు ఉద్ధేశ్యం. ఈ పద్ధతి ద్వారా ఇంటిని ప్రశాంతమైన ప్రదేశంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.
ఒకటి వస్తే.. ఒకటి వెళ్లాల్సిందే
కొత్త వస్తువును ఇంట్లోకి తెచ్చినప్పుడు, అదే రకానికి చెందిన పాతదాన్ని వదిలించుకోవాలి. కొత్త దుస్తులు కొంటే పాతవి ఇచ్చేయడం, కొత్త పాత్రలు వస్తే వాడని వాటిని తొలగించడం చేయాలి. లేదంటే గది సర్దడం పేరుతో వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది.
ఉనికికి కారణం ఉండాలి
ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉండాలి. అందం కోసం ఉంచే అలంకరణ వస్తువైనా సరే, అది నిజంగా మనసుకు నచ్చేదై ఉండాలి. షోకేసుల్లో ప్రతి అంగుళాన్నీ ఏదో ఒక వస్తువుతో నింపాల్సిన అవసరం లేదు.
ఎక్కువ కంటే.. నాణ్యతే ముఖ్యం
చవకగా వస్తున్నాయని ఐదు నాసిరకం వస్తువులు కొనే బదులు, ఎక్కువ కాలం మన్నే ఒకే ఒక్క నాణ్యమైన వస్తువును ఎంచుకోవడం మంచిది. తక్కువ వస్తువులు కొనుగోలు చేస్తూ సహజ సిద్ధమైన, మన్నికైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆగి ఆలోచించండి
షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఏదైనా వస్తువు బాగా నచ్చితే, వెంటనే కొనేయకుండా వారం రోజుల పాటు ఆగండి. ఆ తర్వాత కూడా అది అత్యవసరం అనిపిస్తేనే కొనండి. చాలా సందర్భాల్లో ఆ క్షణపు ఆకర్షణ మాత్రమే అని తేలిపోతుంది.
కంటికి కనిపించకుండా దాచేయండి
నిత్యం ఉపయోగించే మిక్సీ, టోస్టర్, డబ్బాలు వంటివి ఎప్పుడూ కిచెన్ కౌంటర్‌పైనే ఉంచితే ఇల్లు కిక్కిరిసిపోయినట్లు కనిపిస్తుంది. వాడిన తర్వాత వాటిని క్యాబినెట్లలో దాచేస్తే వంటిల్లు విశాలంగా కనిపిస్తుంది.
ఖాళీ స్థలానికీ విలువ ఇవ్వండి
జపనీస్ సంస్కృతిలో ఖాళీ స్థలాన్ని ‘మా’ (Ma) అంటారు. ప్రతి గోడకు ఫోటో ఫ్రేమ్‌లు, ప్రతి మూలా పూల తొట్లతో నింపేయకుండా కొంత స్థలాన్ని ఖాళీగా వదిలేయాలి. ఆ ఖాళీదనమే ఇంటికి ఊపిరి పోస్తుంది.
ఎంపికలు తగ్గిస్తే.. సమయం ఆదా
అల్మారా నిండా బట్టలు ఉన్నా ఉదయం వేళ ‘ఏం వేసుకోవాలి?’ అని తికమకపడే వారి సంఖ్య ఎక్కువ. అవసరమైన దుస్తులు మాత్రమే అందుబాటులో ఉంటే నిర్ణయం తీసుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం సులువవుతుంది.
జ్ఞాపకాలు వస్తువుల్లో కాదు, మనసులో
ఎవరో బహుమతిగా ఇచ్చారని, లేదా ప్రత్యేక సందర్భంలో కొన్నామని పాత వస్తువులను ఏళ్ల తరబడి మూలన పడేస్తుంటాం. జ్ఞాపకాలు మనసులో ఉంటాయి తప్ప, వస్తువులోనే ఉండవు. ఉపయోగం లేని వస్తువులను నిర్మొహమాటంగా వదిలేయడమే మేలు.
సర్దుబాటు.. ఆత్మపరిశీలన
ఇంటిని శుభ్రం చేసుకోవడమంటే కేవలం దుమ్ము దులపడం మాత్రమే కాదు. బీరువాలోని ప్రతి వస్తువునూ చూస్తూ ‘దీన్ని నిజంగా వాడుతున్నానా? ఇది నాకింకా అవసరమా?’ అని సమీక్షించుకోవాలి. అప్పుడే అనవసర వస్తువుల భారం నుంచి ఇల్లు విముక్తి పొందుతుంది.
ఖాళీగా ఉండటం అంటే ఏదో లోపించిందని కాదు; అక్కడ ఇంకేమీ చేర్చాల్సిన అవసరం లేనంత పరిపూర్ణత ఉందని గుర్తించడమే అసలైన మినిమలిజం.