ప్రతి తప్పునీ సరిచేసే కాంట్రాక్ట్ మనకెందుకు?
bheemkonduru ·

ఎదుటివాడు మన కళ్లముందే ఏదైనా తప్పు మాట్లాడగానే, మనలో నిద్రపోతున్న “ఉచిత విజ్ఞాన ప్రదాత” హఠాత్తుగా కళ్లు తెరుస్తాడు.
లోపల ఏదో సైరన్ మోగుతుంది.
“అది తప్పు నాయనా… నేను సరిచేయకపోతే ఈ భూగోళం తన కక్ష్య తప్పుతుంది!” అనే రేంజ్‌లో ఒక ఆవేశం పొంగుకొస్తుంది.
అక్కడ మన ఉద్దేశం నిజంగా ఎదుటివాడికి జ్ఞానోదయం చేయడమేనా అంటే… ప్రతిసారీ కాదు.
కొన్నిసార్లు విషయం చాలా సింపుల్.
“నువ్వు తప్పు. నేను కరెక్ట్. అది నీకు తెలియాలి.”
అంతే.
ఐదు సెకన్ల చిన్న correctionతో మొదలైన వ్యవహారం కాస్తా, అరగంట కల్లా మూడో ప్రపంచ యుద్ధం స్థాయికి వెళ్లిపోతుంది. అసలు విషయం ఎప్పుడో పక్కకు వెళ్లిపోతుంది. నిజాన్ని రక్షించడం కంటే మన “ego”కి దెబ్బ తగలకుండా చూసుకోవడమే ముఖ్యమైపోతుంది.
బ్యాంకులో రూపాయి ఖర్చు పెట్టాలంటే వందసార్లు ఆలోచించే మనం, మన దగ్గరున్న attention అనే ఖరీదైన ఆస్తిని మాత్రం ఏ సంబంధం లేని వాళ్ల మీద తెగ దానం చేసేస్తుంటాం.
ఉదయం లేచిన దగ్గర్నుంచి office tensions, ఇంటి బాధ్యతలు, పిల్లలు, పనులు… ఇవన్నీ సరిపోవన్నట్టు, ఎవరో ఒకరు తప్పుగా అనుకుంటున్నారని వాళ్ల వెనకాల పడి మన సమయాన్ని కూడా సమర్పించేస్తాం.
ఇంతకంటే గొప్ప charity ఏముంటుంది?
“వాళ్లకు నిజం తెలియాలి కదండీ” అని మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ కొన్నిసార్లు అక్కడ నడిచేది నిజం కోసం పోరాటం కాదు.
“I am right. You are wrong.”
అనే చిన్న ego game.
ఇక social media అయితే దీనికి ప్రత్యేకంగా కట్టించిన stadium లాంటిది.
పేరు తెలియదు.
ఊరు తెలియదు.
జీవితంలో ఎప్పుడూ కలవం.
అలాంటి ఎవరో ఒకరు Facebookలోనో, Xలోనో రెండు లైన్ల comment రాస్తారు.
వెంటనే మనలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు రగిలిపోతాడు.
పదిహేను నిమిషాలు కూర్చుని పెద్ద వ్యాసంలాంటి reply కొడతాం.
వాళ్లు counter ఇస్తారు.
మనం evidence పెడతాం.
వాళ్లు ఇంకో point తీసుకొస్తారు.
ఇక మొదలవుతుంది typing కుస్తీ.
ఈ యుద్ధంలో గెలిచి మనం సాధించేది ఏమిటి?
రూపాయి లాభం ఉండదు.
మన opinion మారదు.
వాళ్ల opinion మారదు.
కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఆ అపరిచితుడు పెట్టిన చివరి comment గుర్తొస్తుంది.
పోయిన ప్రశాంతత మాత్రం తిరిగి రాదు.
ప్రపంచంలోని ప్రతి తప్పునీ సరిదిద్ది అందరికీ జ్ఞానోదయం చేయడానికి జగద్గురువులం కాదు
ఎదుటివాడు మన favourite హీరో సినిమా చెత్త అన్నాడా?
అననివ్వండి.
మన profession గురించి సగం తెలిసి పూర్తి confidenceతో మాట్లాడుతున్నాడా?
మాట్లాడనివ్వండి.
మన గురించి కూడా తప్పుగా అనుకుంటున్నాడా?
కొన్నిసార్లు అది కూడా పరవాలేదు.
ప్రతి తప్పుడు అభిప్రాయం మన correction కోసం ఎదురుచూస్తూ ఉండదు.
పైగా కొందరు తెలుసుకోవడానికి వాదించరు.
వాదించడానికే వాదిస్తారు.
మనం ఒక point చెబితే ఇంకోటి తీసుకొస్తారు. దానికి సమాధానం చెబితే మరో వైపు వెళ్తారు. కొద్దిసేపటికి అసలు conversation ఎక్కడ మొదలైందో కూడా మర్చిపోతాం.
అలాంటి ఆటలో గెలవడానికి ఒక సులభమైన మార్గం ఉంది.
అసలు ఆ ఆట ఆడకపోవడం.
అయితే మౌనంగా ఉండటం అంటే ప్రతిదీ పట్టించుకోకుండా ఉండటం కాదు.
మన కుటుంబాన్ని ప్రభావితం చేసే విషయం అయితే మాట్లాడాలి.
మన పనికి సంబంధించిన విషయం అయితే మాట్లాడాలి.
మన బాధ్యతలో ఉన్న నిర్ణయం అయితే మాట్లాడాలి.
ఒక తప్పు సమాచారం వల్ల నిజంగా ఎవరికైనా నష్టం జరిగే అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడాలి.
కానీ ప్రతి opinion మన responsibility కాదు.
మౌనంగా ఉండటం అంటే ఓడిపోవడం కూడా కాదు.
కొన్నిసార్లు అది చాలా సింపుల్ ఈక్వేషన్
“దీనికోసం నా attention ఖర్చు పెట్టడం నాకు అవసరమా?”
అంతే.
ఇంట్లో పిల్లలున్నారు.
చూసుకోవాల్సిన పని ఉంది.
కాపాడుకోవాల్సిన ఆరోగ్యం ఉంది.
చదవాల్సినవి ఉన్నాయి.
చేయాలనుకున్నవి ఇంకా చాలా ఉన్నాయి.
ఇవన్నీ వదిలేసి సమాజంలో, ఇంటర్‌నెట్‌లో కనిపించే ప్రతి తప్పునీ సరిదిద్దే పని మనకెందుకు?
భూమ్మీద ఉన్న ప్రతి తప్పునూ సరిచేసే contract మనకేం దక్కలేదు కదా.
కదా?