సినిమా చుట్టూ మనం ఖర్చు చేసే సమయం
bheemkonduru ·

సినిమా శుక్రవారం విడుదలవుతుంది.
కానీ మన మెదళ్ళ మీద దండయాత్ర మాత్రం ఎన్నో నెలల ముందు, సంవత్సరాల ముందు మొదలవుతుంది.
మొదట అనౌన్స్‌మెంట్ పోస్టర్. తర్వాత టైటిల్ గ్లింప్స్. హీరో పుట్టినరోజుకు ఫస్ట్ లుక్. మరో పండక్కి టీజర్. ఆ టీజర్‌కు రియాక్షన్ వీడియోలు. పాట రాకముందు సాంగ్ ప్రోమో. పాట వచ్చాక లిరికల్ వీడియో, డాన్స్ రీల్స్, మేకింగ్ వీడియో.
ఇలా సినిమా విడుదల కాకముందే ఎన్నో గంటల సమయాన్ని మనం ఖర్చు పెట్టేసాం.
పాత రోజుల్లో..
ఒకప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. వార్తా పత్రికల్లో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు చూచాయగా తెలిసేవి.
ఒకప్పుడు సినిమా చూడాలంటే మనం థియేటర్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు సినిమా మన దగ్గరకు చాలా ముందుగానే వచ్చేస్తోంది. ఫోన్ తెరిస్తే పోస్టర్. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్. న్యూస్ చానల్‌లో కాంట్రవర్సీ.
సినిమా మొదలయ్యేలోపే దాని చుట్టూ ఉన్న ప్రతిదీ మనకు తెలిసిపోతుంది. హీరో ఈ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడు, హీరోయిన్ ఎన్ని రోజులు షూటింగ్ చేసింది, డైరెక్టర్ క్లైమాక్స్ గురించి ఏ హింట్ ఇచ్చాడు, ప్రొడ్యూసర్ బడ్జెట్ గురించి ఏం చెప్పాడు… సినిమా చూడటానికి అవసరం లేని సమాచారం కూడా మన దగ్గర ఉంటుంది.
అయినా ఇంకేదో మిగిలిపోయినట్టు అనిపిస్తుంది.
ఆడియో ఫంక్షన్ చూడాలి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో స్పీచ్ వినాలి. ఆ స్పీచ్‌లోని ఒక మాట ఎందుకు వైరల్ అయిందో తెలుసుకోవాలి. ఎవరు ఎవరిని పొగిడారు, ఎవరి పేరు చెప్పడం మర్చిపోయారు, యాంకర్ ఏం అడిగింది, ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా సినిమా అనే ఆ అనుభవంలో భాగాలైపోయాయి.
నిజానికి ఇవి సినిమా కాదు.
సినిమా అనే ఎంటర్‌టైన్‌మెంట్ చుట్టూ సోషల్ మీడియా కంపెనీలు, PR కంపెనీలు సృష్టించిన ఓ మిథ్యా ప్రపంచం.
ఖర్చయ్యే సమయం
మనం సినిమా గురించి ఆలోచిస్తూ, దాని చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయానికీ కొంచెం కొంచెంగా మన అటెన్షన్ ఇస్తూ మన విలువైన సమయాన్ని దానికి ధారపోస్తాం.
టికెట్‌కు ఎంత ఖర్చయిందో మాత్రం గుర్తుంటుంది. మూడు వందలా, ఐదు వందలా అని లెక్క వేస్తాం. పార్కింగ్, పాప్‌కార్న్ కలిపితే మరీ ఎక్కువైందని బాధపడతాం.
కానీ మనం ఖర్చు చేసిన సమయం మన గుర్తింపులో ఉండదు.
టీజర్‌కు మూడు నిమిషాలు. ట్రైలర్ అనాలిసిస్‌కు ఇరవై నిమిషాలు. ఇంటర్వ్యూకు నలభై నిమిషాలు. పాటలు, రీల్స్, రియాక్షన్స్, కాంట్రవర్సీలు, రివ్యూలు - ఇలా మనం ఎంత టైం ఖర్చు చేస్తున్నామనే విషయం మనకు తెలియదు. ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనకు ఎవరైన కంపెనీ ఉంటే దానికి ఓ రెండు మూడు గంటలు.
అన్నీ కలిపి చూస్తే మాత్రం ఒక సినిమాకు మనం వెచ్చించేది రెండున్నర గంటలే కాదు. కొన్ని సినిమాల విషయంలో అది ఇరవై గంటలు కావచ్చు. అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు.
రిలీజ్ రోజు హడావుడి
రిలీజ్ రోజు అసలు హడావుడి మొదలవుతుంది.
రివ్యూ చూడకుండా సినిమా చూడలేం. రివ్యూ చూసిన తర్వాత కామెంట్స్ చదవకుండా ఉండలేం. సినిమా బాగుందని ఒకరు చెబితే ఎందుకు బాగుందో తెలుసుకోవాలి. బాలేదని ఇంకొకరు చెబితే ఆయనకు సినిమాలు అర్థం కావని నిరూపించాలి. నలుగురు రివ్యూవర్స్, వారి వీడియోలు, వాటికి కౌంటర్లు, కామెంట్లు.
మనకు ఒక్క రూపాయి కూడా రాని కలెక్షన్స్ గురించి గంటల తరబడి మాట్లాడతాం.
“ఫస్ట్ డే ఎంత?”
“బ్రేక్ ఈవెన్ అయిందా?”
“ఓవర్సీస్‌లో ఎలా ఉంది?”
ఆ సినిమా లాభాల్లో మనకు షేర్ ఉండదు. నష్టపోతే అప్పు తీర్చాల్సిన పనీ లేదు. అయినా ప్రొడ్యూసర్‌కంటే టెన్షన్ మనకే ఎక్కువగా ఉంటుంది.
కొన్నిసార్లు సినిమా చూడకముందే దాన్ని డిఫెండ్ చేయడం మొదలుపెడతాం. ఇంకొన్నిసార్లు చూడకముందే ఫ్లాప్ అని నిర్ణయించేస్తాం. అప్పుడు మనం ప్రేక్షకుల్లా కాకుండా, మనకే తెలియకుండా సినిమా ప్రచారంలో భాగమైపోతాం.
ఇందులో మార్కెటింగ్ వాళ్లను, సోషల్‌మీడియా కంపెనీలను తప్పుపట్టడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. మన అటెన్షన్ సంపాదించడం వాళ్ల పని. ఒక సినిమా గురించి ఎక్కువ రోజులు మాట్లాడించగలిగితే అది వాళ్ల విజయమే.
అలా చేయడం వాళ్ళ వృత్తి, మనషి ప్రవృత్తిలోని అన్ని బలహీనతలను వాళ్ళు exploit చేస్తారు.
మనం ఎంతవరకు అందులో పావులమవుతున్నాం అనేది మనం చూసుకోవాల్సిన విషయం.
ఒక కథను ఆస్వాదించడానికి దాని బడ్జెట్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పాట నచ్చడానికి లాంచ్ ఈవెంట్ చూడాల్సిన పనీ లేదు. ఒక నటుడి పర్ఫార్మెన్స్ మనల్ని కదిలించిందా లేదా తెలుసుకోవడానికి ఓపెనింగ్ డే కలెక్షన్ ఉపయోగపడదు.
బహుశా సినిమా చూడటంలో ఉన్న చిన్న ఆనందాన్ని మనమే చాలా కాంప్లికేటెడ్ చేసుకున్నాం.
ఏమీ తెలియకుండా, పెద్ద expectations లేకుండా థియేటర్‌లోకి వెళ్లడం ఒకప్పుడు సాధారణం. ఇప్పుడు అది లగ్జరీలా అనిపిస్తోంది. కథ ఎటు వెళుతుందో తెలియకపోవడం, సర్‌ప్రైజ్ నిజంగా సర్‌ప్రైజ్‌గా రావడం, మన అనుభవం ఆధారంగా మనకు అభిప్రాయం ఏర్పడటం - ఇవన్నీ క్రమంగా అరుదైపోతున్నాయి.
అసలు సమస్య ఏంటి?
దీని అర్థం సినిమా గురించి ఎగ్జైట్‌మెంట్ వద్దని కాదు.
ఫ్రెండ్స్‌తో ట్రైలర్ గురించి మాట్లాడటం, అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూడటం, మంచి పాటను పదిసార్లు వినటం - ఇవన్నీ కూడా సినిమాతో మనకున్న సరదాలో భాగమే.
సమస్య ఎగ్జైట్‌మెంట్‌లో లేదు. మన అటెన్షన్ ఎంత ఖర్చవుతోందో మనం గమనించకపోవడంలో ఉంది.
ప్రతి అప్‌డేట్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కాంట్రవర్సీలో మన అభిప్రాయం ఉండాల్సిన పనీ లేదు. సినిమా విడుదలకు ముందే దాన్ని ప్రేమించాల్సిన లేదా ద్వేషించాల్సిన బాధ్యత మన మీద లేదు.
ట్రైలర్ ఒక ఆహ్వానం మాత్రమే. ఇంటర్వ్యూ ఒక ప్రమోషన్. కలెక్షన్స్ నిర్మాత లెక్కలు. అవన్నీ మన వ్యక్తిగత పనులుగా మారినప్పుడే ఒక సినిమా తన నిడివికంటే చాలా ఎక్కువగా మన జీవితాన్ని ఆక్రమిస్తుంది.
అందుకే అప్పుడప్పుడు ఏమీ తెలుసుకోకుండా సినిమా చూడటం బాగుంటుంది. మన కోసం ఎవరో ముందే “వండివార్చిన” ఎగ్జైట్‌మెంట్‌తో కాకుండా, మన సొంత ఆసక్తితో థియేటర్‌లోకి వెళ్లడం. బయటకు వచ్చిన తర్వాత ఇతరుల రేటింగ్ కోసం వెంటనే వెతకకుండా, మనకు నిజంగా ఎలా అనిపించిందో కాసేపు అలాగే ఉండనివ్వడం.
మనకు చూడాలనుకున్న సినిమాల టికెట్లకు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. రెండున్నర గంటల అటెన్షన్ కూడా ఇవ్వొచ్చు.
కానీ వాటి మార్కెటింగ్‌కు మన సమయాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
సినిమా మన జీవితంలో ఓ చిన్న సరదా మాత్రమే.
దానిని అంతవరకే పరిమితం చేసుకుందాం.
అంతకు మించి దాని వేరే అర్థంలేదు. పరమార్థం లేదు.