Telugu Life

పిల్లలు, ప్రవర్తన, పరివర్తన.

bheemkonduru ·

పిల్లలు తప్పు చేసినప్పుడు మనకు వాళ్ల ప్రవర్తన మార్చాలని ఉంటుంది. కానీ కోపంలో మన మాటలు చాలాసార్లు ప్రవర్తన దగ్గర ఆగవు.

"నువ్వు చాలా మొండివాడివి."
"నీకు అసలు బాధ్యత లేదు."
"నువ్వు ఎప్పుడూ ఇంతే."
"నీకు చెప్పినా అర్థం కాదు."
"ఫలానా వాళ్ళను చూసి నేర్చుకో."

మన ఉద్దేశం ఈ పని మళ్లీ చేయకు అని చెప్పడం కానీ పిల్లలకు వినిపించే అర్థాలు వేరు. నేను ఇలాంటివాడిని లేదా ఇలాంటి దాన్ని అని వాళ్ళు అనుకోవచ్చు. ఈ చిన్న అపార్థపు పర్యవసానాలు జీవితకాలం ఉంటాయి.

పిల్లవాడు కోపంతో ఏదైనా విసిరేశాడనుకుందాం. "నువ్వు చాలా మొండివాడివి" అని కేకలు వేయడం ఒక పద్దతి. "నువ్వంటే నాకు ఇష్టం. కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని నాకు నచ్చలేదు" అని అనునయంగా చెప్పడం ఇంకో పద్ధతి.

రెండింటిలోనూ తప్పును సమర్థించడం లేదు. కానీ రెండో విధంగా చెప్పినప్పుడు ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది.

పిల్లవాడు సమస్య కాదు. అతను చేసిన పని సమస్య.

ఇది పిల్లల్ని గారాబం చేయడం కాదు. తప్పు చేసినా ఏమీ అనకుండా వదిలేయడం అంతకంటే కాదు.

నచ్చని ప్రవర్తనను నచ్చలేదనే చెప్పొచ్చు. కోపం రావచ్చు. అవసరమైతే కఠినంగా కూడా ఉండొచ్చు. కానీ పిల్లవాడి వ్యక్తిత్వాన్ని ఆ ఒక్క సంఘటనతో నిర్వచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఫలానా అని ముద్ర వెయ్యాల్సిన అవసరం లేదు.

"నువ్వు అబద్ధాలకోరువి" అనడానికి బదులు, "నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేదు."

"నువ్వు careless" అనడానికి బదులు, "నీ వస్తువులు మళ్లీ అక్కడే వదిలేశావు."

"నీకు చదువు రాదు" అనడానికి బదులు, "ఈసారి నువ్వు సరిగ్గా సిద్ధం కాలేదు."

మొదటి రకంగా మాట్లాడితే, పిల్లలకు మార్చుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే సమస్య "నేనే" అయితే ఏం మార్చుకోవాలి?

రెండో రకంగా చెబితే మాత్రం వారికి ఒక అవకాశం కనిపిస్తుంది. నేను చేసిన పని మార్చుకోవచ్చు. మళ్లీ ప్రయత్నించొచ్చు. తర్వాతిసారి వేరుగా చేయొచ్చు.

పిల్లలు మన మాటలతో తమ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు.

చిన్న వయసులో పిల్లలకు తమ గురించి ఒక నిర్ధుష్టమైన అభిప్రాయం ఉండదు. వాళ్లు తమను కొంతవరకు మన కళ్లలో చూసుకుంటారు.

"నువ్వు చాలా shy."
"వీడికి ధైర్యం తక్కువ."
"ఇది చాలా stubborn."
"వాడికి maths రాదు."

ఇవన్నీ మనం సాధారణంగా అనే మాటలే. కొన్నిసార్లు బంధువుల ముందు నవ్వుతూ అన్న మాటలే.

ఒకటే మాట మళ్ళీ మళ్ళీ వింటే, అది మనసులో నాటుకుపోతుంది, ఊరకనే విని మర్చిపోవడం జరగదు. నెమ్మదిగా identity అవుతుంది.

"నాకు maths రాదు."
"నేను shy."
"నేను కోపిష్టిని."
"నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను."

పిల్లల ప్రవర్తన మారుతూ ఉంటుంది. వయసుతో మారుతుంది. పరిస్థితులతో మారుతుంది. నేర్చుకున్నకొద్దీ మారుతుంది. కానీ మనం అనాలోచితంగా పెట్టిన labels మాత్రం కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువకాలం పెరుగుతాయి.

ప్రవర్తనలో పరివర్తన

పిల్లవాడు తప్పు చేసినప్పుడు మనకు కోపం రావడం సహజం. కానీ ఆ క్షణంలో పిల్లవాడికి ఒక విషయం స్పష్టంగా తెలియడం చాలా ముఖ్యం.

"నేను చేసిన పని అమ్మకు నచ్చలేదు" ఈ విషయం తెలిస్తే పిల్లలు తాము చేసిన తప్పు సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

"అమ్మకు నేనే నచ్చను" అనుకుంటే, సమస్య వేరే స్థాయికి వెళ్ళిపోతుంది.

అందుకే కొన్నిసార్లు ఒక చిన్న మాట చాలు.

"నువ్వంటే నాకు ఇష్టం. కానీ ఈ ప్రవర్తన నాకు నచ్చలేదు."

ఇలా చెప్పడం వల్ల, పిల్లలకు తమ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి ఒక దారి కనిపిస్తుంది. చాలా వరకు మారతారు కూడా.

పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాం. ఏ స్కూల్? ఎన్ని activities? Screen time ఎంత? ఏం తింటున్నారు? ఎంత చదువుతున్నారు?

కానీ వాళ్లు తప్పు చేసిన ఆ రెండు నిమిషాల్లో మనం ఉపయోగించే నాలుగు మాటలు కూడా అంతే ముఖ్యమైనవేమో.

ఎందుకంటే మనం సరిచేయాలనుకున్నది ఒక ప్రవర్తన మాత్రమే. పిల్లలు తమకు తాముగా జరిగిన తప్పునో, పొరబాటునో అర్థం చేసుకుంటే తప్ప మనం కోరుకునే మార్పురాదు. వాళ్ళనే సమస్యగా మార్చేస్తే దారులన్నీ మూసుకుపోతాయి. మన మాటలు వేసే ముద్రలు వారిని జీవితాంతం ప్రభావితం చేస్తాయి.

ఎందుకంటే ఈ రోజు మనం అనే మాటలే, రేపు వాళ్ళు తమ గురించి తాము అనుకునే మాటలు అవుతాయి.