బిజీ బిజీ జీవితం పెంచుతున్న అంతరం
bheemkonduru ·

మన జీవితంలో కొందరు ఉంటారు.
ఒకప్పుడు వారితో గడిపిన సమయం నిండుగా అనిపించేది. వారు మాట్లాడితే మనం వినేవాళ్ళం — నిజంగా వినేవాళ్ళం. వారికి ఏదైనా జరిగితే తెలిసేది, తెలియకపోయినా తెలుసుకోవాలనిపించేది. మన మంచి చెడుల గురించి వాళ్ళకి చెప్పుకోవాలని అనిపించేది.
ఇప్పుడు?
ఇప్పుడు వారు మన contacts లో ఉంటారు. పండగలకు, పుట్టినరోజులకు message వస్తుంది. మనమూ పంపిస్తాం. "బాగున్నావా" కి "బాగున్నాను, నువ్వు?" అని ముక్తసరి సమాధానం వస్తుంది.
అంతే.
బంధాలు తెగిపోవడం గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మనం పెద్ద గొడవల గురించే మాట్లాడతాం. ఆర్థిక పరమైన విషయాలు, అపోహలు, మోసాలు. ఇలాంటి ఏదో ఒక కారణాలు ఉంటేనే మనుషులు విడిపోతారని అనుకుంటాం.
కానీ చాలా సందర్భాలలో అవేమీ అక్కర్లేదు.
కాలమనే దూరం పెరిగేకొద్దీ అవి మెల్లగా రంగు వెలిసిపోతాయి. తరచూ ఫోన్ చెయ్యడం ఒకరోజు ఆగిపోతుంది, తర్వాత message చేద్దాం అనుకుంటాం. ఏవో పనుల్లో పడి దాన్ని వాయిదా వేస్తూ పోతాం. ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళు గుర్తుకువస్తారు, మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది, ఆ క్షణంలో చేశామా సరే లేకపోతే మళ్ళీ అది ఎప్పటికో..
మళ్ళీ మర్చిపోతాం.
ఇందులో విలన్ ఎవరూ లేరు. మనం చెడ్డవాళ్ళం కాదు. వారూ కాదు. జీవితం నిజంగానే బిజీగా ఉంది. మన భారాలు, బాధ్యతలు అన్నీ వాస్తవమే. కానీ వారిని miss అవుతున్నామనే భావన మాత్రం పోదు. మనకు వారికి ఉన్న బంధానికి ఇదే గుర్తు.
నిజానికి ఆ బంధాన్ని మనమే అలా వదిలేశాం — కానీ consciously కాదు. ఒక నిర్ణయం తీసుకుని కాదు. పెద్దగా ప్రయత్నం చేయకుండా, పట్టించుకోకుండా, ఉదాసీనంగా వదిలేశాం.
మనందరి మనసులో అలాంటి పేర్లు, అనుబంధాలు ఎన్నో ఉంటాయి.
ఇప్పుడు మనసులో ఏవైనా పేర్లు మెదిలాయా?
ఈరోజే call చేద్దాం. Message కాదు — call. ఏ కారణం అక్కర్లేదు. "గుర్తొచ్చారు" అంటే చాలు.