డిజిటల్ మోసాల వలలో పడకుండా ఉండాలంటే?
bheemkonduru ·

డిజిటల్ లావాదేవీలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో, అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో విరుచుకుపడుతున్నారు. గతంలోలాగా సాధారణ మోసాలు కాకుండా.. కేవైసీ (KYC) అప్‌డేట్, విద్యుత్ బిల్లుల బకాయిలు, కొరియర్ పార్సిల్ సమస్యలు లేదా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల పేరిట బురిడీ కొట్టిస్తున్నారు. కాస్త అప్రమత్తత తగ్గినా కష్టపడి సంపాదించిన డబ్బంతా క్షణాల్లో మాయమవుతోంది. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'జెరోధా' (Zerodha) అందించిన విశ్లేషణల ఆధారంగా, ఈ తరహా ఆర్థిక మోసాల వెనుక ఉన్న వ్యూహాలేమిటి? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ఆలోచించుకునే అవకాశం లేకుండా భయపెట్టడమే వారి అస్త్రం!
సైబర్ నేరగాళ్లు సాంకేతిక లోపాల కంటే ఎక్కువగా సామాన్యుల మానసిక బలహీనతలనే ఆసరాగా చేసుకుంటారు. ఆలోచించే సమయం ఇవ్వకుండా వెంటనే నిర్ణయం తీసుకునేలా (Panic Reaction) చేయడమే వారి ప్రధాన ఉద్దేశం:
- తీవ్ర ఒత్తిడి: ఖాతా కొన్ని నిమిషాల్లో స్తంభించిపోతుందని, కేవైసీ గడువు ముగిసిందని లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని భయభ్రాంతులకు గురిచేస్తారు.
- చట్టపరమైన బెదిరింపులు: తాము పోలీసులమని, సీబీఐ లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెబుతూ కేసులు, జరిమానాలు, డిజిటల్ అరెస్టులతో బెదిరింపులకు దిగుతారు.
- అత్యాశకు గాలం: స్టాక్ మార్కెట్‌లో 'కచ్చితమైన లాభాలు' (Guaranteed Returns), తక్షణ రుణాలు, పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరిట భారీ రాబడులు ఆశచూపుతారు.
భయం లేదా అత్యాశ ఆవహించినప్పుడు ఎవరైనా విచక్షణ కోల్పోతారు. అవతలి వ్యక్తి నంబరు సరైనదేనా, లింకు సురక్షితమైనదేనా అని పరిశీలించకుండానే వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుని మోసపోతున్నారు.
జ్ఞాపకం ఉంచుకోండి: నగదు లావాదేవీలు లేదా వ్యక్తిగత వివరాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడూ నెమ్మదిగా వ్యవహరించడం (Slow Down) ముఖ్యం. తొందరపడకుండా ఒక్క నిమిషం ఆగి వాస్తవాలను సరిచూసుకోవడమే అన్నింటికంటే పెద్ద రక్షణ కవచం.
ఈ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు చెప్పొద్దు!
బ్యాంకులు, సెబీ (SEBI) గుర్తింపు పొందిన బ్రోకర్లు లేదా మరే ఇతర అధికారిక ఆర్థిక సంస్థలు కూడా ఫోన్ కాల్, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా క్రింది వివరాలను అడగవని గుర్తుంచుకోవాలి:
- ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) నంబర్లు.
- యూపీఐ పిన్ (UPI PIN) లేదా నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్‌వర్డులు.
- ఏటీఎం/క్రెడిట్ కార్డు వెనుక ఉండే సీవీవీ (CVV), కార్డు గడువు తేదీలు.
- వివాదం పరిష్కరిస్తామంటూ ఎనీడెస్క్ (AnyDesk), టీమ్‌వ్యూయర్ (TeamViewer) వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరడం.
- ఖాతాను యాక్టివేట్ చేయడానికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు లేదా గుర్తుతెలియని యూపీఐ ఐడీలకు నగదు బదిలీ చేయమని చెప్పడం.
ఎవరైనా ఈ వివరాలు అడుగుతున్నారంటే అది కచ్చితంగా మోసమేనని గ్రహించి వెంటనే కాల్ కట్ చేయాలి.
మదుపరులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
స్టాక్ మార్కెట్‌లో మదుపు చేసే వారు కొన్ని ప్రాథమిక రక్షణ సూత్రాలను పాటించాలి:
- సెబీ గుర్తింపు ఉన్న సంస్థలనే ఆశ్రయించండి: వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే 'షూర్ షాట్' టిప్స్‌ను అస్సలు నమ్మొద్దు. గుర్తింపు పొందిన బ్రోకర్ల ద్వారానే లావాదేవీలు సాగించాలి.
- 'సెబీ చెక్' (SEBI Check) సద్వినియోగం చేసుకోండి: బ్రోకర్లకు నగదు జమ చేసే సమయంలో ఆ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతా నంబరు అధికారికమైనదేనా కాదా అని నిర్ధారించుకోవడానికి నియంత్రణ సంస్థ సెబీ అందుబాటులోకి తెచ్చిన 'సెబీ చెక్' సాధనాన్ని ఉపయోగించండి.
- చెల్లింపుల సమయంలో పేరు సరిచూసుకోండి: యూపీఐ పిన్ నమోదు చేసే ముందు లబ్ధిదారుడి (Beneficiary) పేరు, కార్పొరేట్ హ్యాండిల్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి.
- లింకుల జోలికి వెళ్లొద్దు: ఎస్సెమ్మెస్, మెసేజింగ్ యాప్‌లలో వచ్చే గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేయకుండా, సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్ చిరునామాను మీ బ్రౌజర్‌లో నేరుగా టైప్ చేసి తెరవడం అలవాటు చేసుకోండి.
- యాప్ అనుమతులపై నిఘా: గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే అధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పనికిమాలిన అనుమతులు (Permissions) అడిగే అనుమానాస్పద యాప్‌లను వెంటనే తొలగించాలి.
డిజిటల్ రక్షణ సూత్రాలు:
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడి నగదు నష్టపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు 1930కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో వివరాలు సమర్పించాలి. ఎంత త్వరగా స్పందిస్తే నిధులు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.